రైతుబిడ్డగా స్వయంగా వ్యవసాయం చేసిన అనుభవం నాకుంది. డిగ్రీ వరకు నాన్నకు సేద్యంలో చేదోడువాదోడుగా ఉన్న కాలంలో... గుంటూరు జిల్లా వేమూరు నుంచి తెనాలి మార్కెట్ కు కూరగాయలన్ని తరలించినప్పుడు వ్యాపారాలు ఎంత నిర్దయగా ధర నిర్ణయిస్తారన్న సంఘటనలకు నేను ప్రత్యేక్ష సాక్షిని. చేను కోత కోశాక ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే ఒక రైతు ఎంతగా తల్లడిల్లిపోతాడో మా నాన్నలాంటి ఎందరో రైతుల్ని మా ఊరిలో చూశాను. పంట వేసింది మొదలు అది చేతికందే వరకు ఒక తల్లి బిడ్డను కనేందుకు ఎంత ప్రసవేదన పడుతుందో సగటు రైతుకు అంతటి ఆవేదన ఉంటుంది. చేతికందే దశలో పంటను భారీ వర్షాలు, తుపాన్లు ఊడ్చేసినప్పుడు ఏ రైతు ఎవర్ని నిందించడం నేను చూడలేదు, తన దురదృష్టానికి చింతించడం తప్ప.