సముద్రం మధ్యలో ఉన్న ద్వీపం అది! అందులో నివసిస్తున్నది ఇద్దరే ఇద్దరు! ప్రోస్పరో అనే వృద్ధుడు. మిరండా అనే యువతి, ఆయన కూతురు.
ఆమె అందాలరాశి! అపురూపలావణ్యపతి! అతి చిన్నతనంలో ఆ ద్వీపానికొచ్చిన ఆమెకు తన తండ్రిని తప్పితే మరొక మానవుడేవణ్ణీ చూసిన జ్ఞాపకాలులేవు.
వాళ్లు నివాసం ఉండేది ఒక కొండ గుహలో నివాసయోగ్యమైన ఆ గుహలో ఒక గదిలో కూర్చుని మంత్ర విద్యకి సంబంధించిన గ్రంథాల్ని చదువుతుంటాడు ప్రోస్పరో. మంత్ర విద్యలో ఆరితేరిన వ్యక్తి అయన! చేతిలోని మంత్ర దండంతో ఎన్ని అద్భుతాలయినా చెయ్యగలడాయన!!
అదృష్టవశాత్తు ఆ ద్వీపానికి తన కూతురితో చేరుకొన్న ఆయన, తన మంత్ర శక్తితో సైకోరెక్స్ అనే మంత్రగత్తెచే, చెట్టు తొఱ్ఱల్లో బంధింపబడిన ఫెయిరీలని విడుదల చేశాడు. చిన్నపాటి మానవ శరీరాలు కలిగిన మహిమాన్వితమైన ప్రాణులు ఫెయిరీలు! అలా విడుదల కాబడ్డ ఫెయిరీలు, ప్రోస్పరో పట్ల కృతజ్ఞతాభావంతో, అతని అదుపు ఆజ్ఞల్లో ఉంటూ, అతడు చెప్పిన పనుల్ని చేస్తుంటాయి! ఆ ఫెయిరీలకి నాయకుడు ఏరియల్!
- డి. ఎ. సుబ్రహ్మణ్య శర్మ