"వింటే భారతమే వినాలి" - యిది అందరు ఆమోదించిన నానుడి. కొన్ని వందల పాత్రలు, భిన్న భిన్న మనస్తత్వాలు, ధర్మాధర్మ విచక్షణ, స్వామిభక్తి నీడలో పలాయనవాదం , ధర్మసంరక్షణార్ధం శ్రీకృష్ణుని "చతురంగపు" ఎత్తులు - యిలా ఎన్నో రకాల కలనేతలు. ద్వాపరయుగంలో జరిగినా , నేటికీ మన సమాజానికి అనువర్తించే ఎన్నో సంఘటనలు, మరెన్నో సందర్భాలు!
మనుషులను నడిపిస్తూ, పలికిస్తూ కథను రక్తి కట్టిస్తూ శ్రీకృష్ణుడు సూత్రధారిగా తన దైవాంశను దర్శింపచేస్తాడు. పాత్రదారిగా గోపాలుడు మహాభారతకథలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు . ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సార్లు చూసినా రసవత్తరంగా వుండడమే కాదు కొత్త సూక్ష్మలను స్ఫురింపజేస్తుంది మహాభారతం.