విశ్వవిద్యాలయాలు, సంస్థలు సమూహంగా ఏర్పడి సంవత్సరాలు తరబడి చేయాల్సిన పనుల్ని వ్యక్తిగా ఆళ్వారుస్వామి చేసిండు. ఆంధ్రమహాసభ నాయకుడిగా, కాంగ్రెసు వాదిగా, కమ్యూనిస్టు కార్యకర్తగా , రైల్వే , రిక్షాకార్మికుల ఉద్యమకారుడిగా, గుమాస్తాలు నేతగా, కథా , నవల రచయితగా, పుస్తక ప్రచురణ కర్తగా, గ్రంధాలయోద్యమకారుడిగా తెలుగు నెలకు అయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఎవరో చెప్పిండ్రాని ఎదో భావజాలాన్ని ఆవాహన చేసుకోకుండా స్వయంగా దాని గురించి చదివి తెలుసుకొని నిర్ణయం తీసుకునేందుకు వీలుగా భిన్న భావజాలాల్ని పాఠకులకు పరిచయం చేసిండు. ప్రజాభ్యుదయం కోసం పనిచేస్తున్న "ఆంధ్రమహాసభ" కు తన వంతు తోడ్పాటుగా "దేశోద్ధారక గ్రంథమాల"ను స్థాపించి పుస్తకాలు అచ్చేసి ఊరూరా తిరిగి భావజాల వ్యాప్తికి తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా, పుస్తకాల ద్వారా రెండు దశాబ్దాలపాటు నిరంతరం కృషి చేసిండు. ఈ భావజాల వ్యాప్తే తదనంతరం కాలంలో కాంగ్రెసు ఉద్యమాలకు, సాయుధ పోరాటాలకు తెలంగాణ జనసామాన్యాన్ని అండగా నిలిపింది.