వాదం. గత 30 వేల సంవత్సరాల మానవ నాగరికత చరిత్రలో అత్యంత కీలకమైన కారకం వాదం. కొత్త ఆలోచనలకు, అభిప్రాయాలకు ఎల్లప్పుడూ వాదం వేదికగా నిలిచింది. ఈ వేదికే లేకపోతే నాగరికత ఆశించిన స్థాయిలో ముందడుగు వేయదు.
మానవ పరిణామ క్రమంలో అనేక దశలు చోటు చేసుకున్నాయి. వాటిలో అంతర్లీనంగా, మౌనంగానైనా వాదం ఛాయలు కనిపిస్తాయి. ఏ పరిణామ క్రమం వాదన, చర్చ లేకుండా, తర్జన భర్జన జరగకుండా, వాదులాట లేకుండా ముందుకు కదిలిందని భావించలేం.
ప్రశ్నకు పర్యాయపదంగా వాదాన్ని చెప్పుకోవచ్చు. కొత్త ప్రతిపాదనకు భూమికగా భావించవచ్చు. మెరుగైన భావనల గుచ్ఛంగా తిలకించవచ్చు. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాల సముచ్చయం వాదం.
రోమన్ సామ్రాజ్యంలో గాని, అంతకు ముందు గల హిబ్రూ సమూహాల్లో గాని, ఆఖరికి మన కురు - పాండవుల మధ్య వాదం బలంగా కనిపిస్తుంది. అలా వాద ప్రతివాదనల సింథసీన్ వల్ల, మథనం వల్ల, మేలు కలయిక వల్ల ఆరోగ్యప్రదమైన అంశాలు వెలుగు చూసాయి.
- వుప్పల నరసింహం