వయసు మళ్ళిన తల్లితండ్రుల ఆలనాపాలనా చూడకుండా వృద్దాశ్రమాలలో చేరటం, సంవత్సరానికోసారి,వారి పుట్టిన రోజున వృద్ధాశ్రమానికి వెళ్ళి తల్లిదండ్రులకు ఒక బొకే ఇవ్వటం పాశ్చాత్య నాగరిక సమాజ సంప్రదాయం. ఇప్పుడు ఆ సంప్రదాయం మన దేశానికీ ప్రాకింది. ఈ మధ్యకాలంలో తమర తంపరగా పుట్టుకొస్తున్నవృద్దాశ్రమాలే ఇందుకు తార్కాణం. పిల్లలున్న తల్లిదండ్రుల స్థితే ఇంతదారుణంగా ఉంటె, పిల్లలులేని వయోవృద్ధుల గురించి చెప్పాల్సింది ఏముంది.
కానీ, పెంచిన, తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడటం పిల్లల కనీస బాధ్యత. ఈ బాధ్యత మానవతాదృక్పధానికి, మానవ సంబంధాలకు, సంస్కారానికి సంభందించినది. కానీ, వర్తమాన భారతదేశంలో మానవ సంబంధాలు, మానవతా దృక్పధం , సంస్కారం అడుగంటుతున్నాయన్నది అక్షర సత్యం. పెట్టుబడిదారీ వ్యవస్థ, వ్యాపార సంస్కృతికి ఇది దర్పణం .ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్చిన్నం కావటం, ధనం పై వ్యామోహం పెరగటం, తల్లిదండ్రులను వదలి సుదూర ప్రాంతాలకు, విదశాలకు ఉద్యోగార్థం వెళ్ళటం కూడా మానవ సంబంధాల విచ్చితికి కారణాలే.
-పెండ్యాల సత్యనారాయణ.