Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కథా నాటక రచయితైన వీరు గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 27 ఆగస్టు 1955న జన్మించారు. కథా రచయితగా వివిధ పత్రికలలో 70కి పైగా కథలు ప్రచురించబడ్డాయి. అనేక ప్రముఖ ప్రతికలలో 25 కథలకు పలు బహుమతులు లభించాయి. తాజ్ మహల్ (1987), కురిసిన మబ్బు (1994), ముందే మేలుకో (2011), నాగేటిచాలు (2014) కథా సంపుటాలు వెలువరించారు. 35 కథలు హిందీలోకి అనువదించబడి, 'తాజ్ మహల్ ఔర్ అన్యకహానియా' పేరిట ఒక సంపుటిగా ప్రచురించబడింది. నాటక రచయితగా వానప్రస్థం, ఏడుగుడిసెల పల్లె, బహుజన హితాయ మొ|| 5 నాటకాలు, శ్రీ చక్రం, హింసధ్వని, ఎడారికోయిల, మి కాల్, ధ్వంసరచన, క్షతగాత్ర గానం, ఒక మహాపతనం, పడుగు, రంకె మొ|| 30 నాటికలు, అనేక శ్రవ్య నాటికలు రచించారు. '25 నాటికలు' (2018) సంపుటి వెలువడింది.
ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శనలుగా హింసధ్వని, (1998) వానప్రస్థం (నాటకం), ధ్వంసరచన నాటికలు బంగారు నంది పొందాయి. ఇంటింటి భాగోతం (2017) వెండి నంది, రంకె (2015), మధుపర్కాలు (2017) కాంస్య నంది బహుమతులు పొందాయి. ఉత్తమ నాటక రచయితగా, వానప్రస్థం (1999), మిస్డ్ కాల్ (2005), ధ్వంస రచన (2007), రంకె, ఇంటింటి భాగోతం, మధుపర్కాలకు ఆరు సార్లు నంది బహుమతులు పొందారు. 'హింసధ్వని' ఆకాశవాణి జాతీయ నాటకోత్సవాలలో (2000సం||) ప్రథమ బహుమతి పొందింది.
పిల్లల కోసం కథలతోపాటు ప్రత్యేకంగా అనేక నాటికలు రచించారు. 'పిల్లల నాటికలు', 'పోరునష్టం - పొందులాభం' పిల్లల నాటికల సంపుటాలు వెలువడ్డాయి. పలు బాలల పత్రికలలో ప్రచురించబడిన పిల్లల కథలతో 'ఏకాగ్రత' సంపుటి వెలువడింది. “వల్లూరు శివప్రసాద్ నాటక సాహిత్యంపై నాగార్జునా యూనివర్శిటి, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం డాక్టరేట్, ఎం. పిల్ డిగ్రీలు ప్రదానం చేశాయి. విశాలాంధ్ర ప్రచురించిన ప్రసిద్ధ తెలుగు నాటికలు' (58), 'ప్రసిద్ధ తెలుగు హాస్య నాటికలు' (50) నాటికా సంకలనాలకు, 'బడిగంటలు', 'ప్రసిద్ధ పిల్లలనాటికలు' పిల్లల నాటికా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం ప్రచురిస్తున్న కథాస్రవంతి సీరిస్కు ప్రధాన సంపాదకుడుగా వ్యవహరిస్తూ, ప్రముఖ కథా రచయితల 33 సంపుటాలు వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.