Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

                         కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గారు స్వర్గస్థులగుటకు కొన్ని రోజుల ముందుగానే నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు శ్రీ భీమ్ సేన్ సచార్తో సహా అనేకమంది ప్రముఖులు, వారిని రాజమండ్రిలోని వారి స్వగృహము “సుదర్శన భవనం"లో పరామర్శించారు.

                        "జాతస్య మరణం ధ్రువం ....” అన్నట్లు శ్రీ శాస్త్రిగారు డిసెంబరు నెల 29వ తేదీ, 1960వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశ్యనంతర ద్వాదశ ఘడియలలో ఆ పరమేశ్వరునిలో ఐక్యం చెందారు. వారి అంత్యక్రియలు రాజలాంఛనోపేతంగా నిర్వహింపబడ్డాయి. రాష్ట్ర, దేశవ్యాప్తంగా సంతాపసభలు, సందేశముల ద్వారా ప్రముఖులు, సాహితీవేత్తలు వారిని "ధన్యజీవి”గా ప్రస్తుతించి ఘన నివాళులర్పించారు. స్వచ్ఛందంగా పురవర్తకులు గౌరవసూచనగా తమ దుకాణ సముదాయాన్ని మూసివేశారు.

                          నాటి అనేకమంది ప్రముఖ రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు శ్రీ శ్రీపాదతో తమకు గల సాన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూ, వారి ఔన్నత్యాన్ని, అనితరసాధ్య కవితాశక్తిని ప్రస్తుతించారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ జాషువా, శ్రీ దాశరథి, శ్రీ కాశీ కృష్ణాచార్య, శ్రీ గిడుగు సీతాపతి, శ్రీ దివాకర్ల వేంకటావధాని వంటి ఉద్దండపండితులు శ్రీపాద నిర్యాణంతో ఒక కవితాశకం అంతరించినందుకు తీవ్రసంతాపం వెలిబుచ్చారు.

                           శ్రీపాద కవిసార్వభౌముల వారసులైన వారి దౌహిత్రుడు కీ||శే|| శ్రీ కల్లూరి సత్యనారాయణమూర్తిగారుకవివర్యుల నిర్యాణానంతరం వారిని గురించి ప్రచురితమైన అనేక పత్రికాశీర్షికలను సేకరించి ఒక సంకలనముగా సంగ్రహపరిచారు.