Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అత్యంత ప్రతిభాశాలి, నిరంతర ప్రగతి శీలి అయిన మహాకవి శ్రీశ్రీ అంటే రెండే రెండు అక్షరాలు కాదు, మండే రెండు అక్షరాలు. అవి నిత్య నూతనంగా రగులుతూనే ఉంటాయి అవి సత్య చేతనంగా శ్రీశ్రీ సాహితీ ప్రియుల్ని, శ్రీశ్రీ అభిమానుల్ని, శ్రీశ్రీ ఆశయ రక్త బంధువుల్ని రగిలిస్తూనే ఉంటాయి. సమతా సుందర మహోన్నత మానవతా మరో ప్రపంచం సాధన కోసం నిరంతర పోరాటోన్ముఖుల్ని చేస్తూనే ఉంటాయి. అతని పేరు కొంచెం! అతని ఊరు ప్రపంచం! అతడే శ్రీశ్రీ !! -
విశ్వసాహిత్యంలో ఎక్కువ కోటబుల్స్ ఉండేది ఆంగ్ల మహాకవి విలియం షేక్ స్పియర్ సాహిత్యంలో అంటారు. కాని మనకు గర్వం ఏమిటంటే తెలుగు భాషలో మన మహాకవి శ్రీశ్రీ సాహిత్యమంతా కోటబుల్సే. ఇది అనితర సాధ్యం, అది అతనికే సాధ్యం . -
ఇవి సమకాలీన సమస్యలపై సంధించిన పదును బాణాలు. మహత్తర మార్మీయ ఎరుపు జ్ఞానాలు. రాజీలేని సాయుధ యుద్ధ నిబద్ద ప్రాణాలు. సమస్త సమయ సందర్భాలలో ఎలుగెత్తి వినిపించే గానాలు. హోరెత్తించే ఝంఝా ప్రభంజనాలు. శ్రమైక జీవన సౌందర్య సామ్యవాద ప్రపంచం కోసం పోటెత్తిన జన రణాలు. -
శ్రీశ్రీ సూక్తులు ప్రచురించాలనుకున్నప్పుడు శ్రీశ్రీ సాహిత్యం నుండి సూక్తులు ఎంపిక చేయడం ఓ పెద్ద ఎసైజ్ అయింది. చేయగా చేయగా చేయగా చివరికి మాకు కలిగిన జ్ఞానోదయం ఏమిటంటే శ్రీశ్రీ సాహిత్యం అంతా సూక్తుల శక్తుల యుక్తులని, సూక్తులు కాని సాహిత్యం లేనే లేదని కాదుగాని ఉన్నా అది అతి తక్కువని.
సహస్ర శ్రీశ్రీ సూక్తులు వెలువరించాలని, ముఖ్యంగా అవి రెండో నూరు పుస్తకాల హోరు ప్రణాళికలో ఒదగడానికి ఇలా ప్రణాళిక వేసుకున్నాం. గద్య, పద్య విభజనగా కాకుండా వస్తువు పరంగా విభజించి మొత్తం వెయ్యి సూక్తులు శ్రీ శ్రీ సూక్తులు పుస్తకాలుగా పాఠకులకు అందించాలనుకున్నాం.
ఇలా శ్రీశ్రీ సమస్త సూక్తుల్నీ నాలుగు విభాగాలు చేసుకుని ఒక్కో విభాగానికి 250 సూక్తులు ఎన్నుకుని ఒక్కో విభాగంలో రెండు పుస్తకాలు చొప్పున నాలుగు విభాగాలకు మొత్తం ఎనిమిది పుస్తకాలుగా తీసుకు వస్తున్నాం.