Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీ శంకర భగవత్పాదులు మనకందించిన అమూల్య అద్భుత వరం స్తోత్రసాహిత్యం . శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనమ్ అనే నవవిధ భక్తి మార్గాలలో రెండవది కీర్తనం. కీర్తనమన్నా స్తుతించటమన్నా ఒకే అర్థంలో పర్యాయ పదాలు గానే వాడుక, పండితైక వేద్యములైన ప్రస్థానత్రయ భాష్యము, ప్రకరణ గ్రంథాలు వంటివి చదివి అహంబ్రహ్మాస్మి అనే స్థాయికి ఎందరు ఎదగగలరు. అందుకే 'మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి' అని, సామాన్య జనులను దృష్టిలో పెట్టుకుని భక్తికి ప్రముఖ స్థానాన్ని కల్పించారు. భక్తిభావనలో ప్రధానంగా ఉండేది భగవంతుని గుణగణ స్తుతియే. అట్టి స్తోత్రవాజ్ఞ్మయాన్ని విస్తారంగా సృష్టించి మానవాళికందించిన మహనీయులు శ్రీశంకరులు. ఈ స్తోత్రాల పఠనం ఒక ఉపదేశాన్ని అందించి, ఉపశమనాన్ని కలిగించే జ్ఞానామృత రస ధార. శివ, విష్ణు, శక్తి, గణేశ, నదీతీర్థ స్తోత్రాలు, ఆధ్యాత్మిక ప్రపత్తిని ప్రబోధించేవి అగు స్తోత్రాలు తొంబదికి పైబడియే లోకమందు ప్రచారంలో ఉన్నాయి. ఈ
ఈ స్తోత్రరత్న రాసిలోంచి 60 స్తోత్రాలను ఆంధ్ర తాత్పర్య సహితంగా విజయవాడ ధర్మ ప్రచారక పోషక సంఘమువారు 1967లో మూడు చిన్నచిన్న సంపుటాలుగా ప్రచురించారు. వీటికి బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, శ్రీ జనార్దనానంద స్వామి (పూర్వాశ్రమమున శ్రీ కుప్పా లక్ష్మావధానులు) సంపాదకత్వం వహించారు. ఇవి కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి పీఠాధిరోహణ షష్ట్యబ్ది సందర్భమున వజోత్సవ గ్రంథమాలికగా వెలువరించారు. తరువాత 1984లో 60 స్తోత్రాల సంకలనమొకటి మద్రాసు స్వధర్మ స్వరాజ్య సంఘమువారు శ్రీజయేంద్ర సరస్వతుల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించారు.