Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
దేవతను స్థూలరూపంలో కాకుండా కారణరూపంలో ఉపాసించుట ఎంతో ముఖ్యమని సాధకులకు విదితమే. యంత్రమునే దేవత కారణరూపమని పేర్కొంటారు. ప్రతీ దేవతకు మంత్రము ఉన్నట్లుగానే యంత్రము కూడా ఉంటుంది. అయితే కాలక్రమేణా యంత్రపూజా విధానములు మరుగునపడుతున్నాయి. అలా మరుగున పడిన విద్యలలో శ్రీమహా గణపతి ఆవరణ పూజా విధానము ఒకటి. ఈ పూజా విధానమును సాధక లోకమునకు అందించాలనే తపనతో నా దగ్గర శ్రీవిద్యను నేర్చుకొంటున్న నా శిష్యుడు అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి పాత గ్రంథములను పరిశీలించి, వాటినుండి గ్రహించిన విధానాలను, నేను నా శ్రీగురువుగారైన శ్రీశ్రీశ్రీ పరసుఖానందనాథ (శ్రీ దువ్వూరి నరసింహమూర్తి) గారి దగ్గర నేర్చుకున్న పద్ధతులను, క్రోడీకరించి ఈ “శ్రీమహా గణపతి ఆవరణ పూజ” అనే పుస్తకాన్ని సంకలనం చేశాడు. ఇందులో పాత్రాసాదన, ఆవరణ దేవతల పూజ మొదలగు విషయములు ఎన్నో చాలా సులభపద్ధతిలో వివరించబడ్డాయి. "కలౌ చండీ వినాయకౌ”) అన్నది నానుడి. కలియుగంలో ఈ దేవతలను అర్చించడం వలన కలియుగ దోషాలు పోతాయని శాస్త్ర వచనము. ఈ పుస్తకము సాధక లోకమునకు ఎంతో ఉపయుక్తమవుతుందనుటలో ఎటువంటి సందేహం లేదు.
ఇంతటి చక్కని పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన చిరంజీవి అయలసోమయాజుల ఉమామహేశ్వర రవికి, అతని కుటుంబ సభ్యులకు నా ఆశీర్వచనములు. ఆ పరదేవత అనుగ్రహ సుధ వారిమీద ఎల్లప్పుడు ఎడతెగని ధారగా కురవాలని శ్రీమాతను ప్రార్ధిస్తున్నాను. సర్వేజనాస్సుఖినోభవంతు!
శ్రీప్రకాశానందనాథ
శ్రీపాద జగన్నాథస్వామి
(హైదరాబాద్)