Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
బహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు ఆంధ్రపాఠకలోకానికి సుపరి చితులే. నవలలు, కథానికలు, సాహిత్య విమర్శలు, పద్య కావ్యాలు, యాత్రా కథనాలు, జీవిత చరిత్రలు మొదలగు ప్రక్రియలన్నింటిలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న వారే. శ్రీ శృంగేరి శారదాపీఠ యాజమాన్యమున వెలువడు ఆధ్యాత్మిక మాసపత్రిక శ్రీ శంకరకృపకు యిరవై సంవత్సరాలకు పైగా సంపాదకులుగా వ్యవహరించారు. పలు వేదాంత, శ్రీవిద్యా గ్రంథాలను రచించి ప్రసిద్ధిని పొందారు. శ్రీ చక్రవిలసనము, శ్రీచక్ర పూజా విధానము, సమయామోదినీ నామ సౌందర్యలహరీ వ్యాఖ్యానము. శ్రీలలితా త్రిశతీ భాష్యాంధ్రానువాదము, శ్రీమత్తిపురసుందరీ వేదపాదస్తోత్ర వ్యాఖ్యానము, శ్రీ దక్షణామూర్తి స్తోత్రవ్యాఖ్యానము, మనమూ - మనమతమూ : వానిలో కొన్ని. వీరి రచనలన్నీ శ్రీ శృంగేరి జగద్గురువుల ఆమోద శ్రీముఖ సమలంకృతములే..
శ్రీరామలింగేశ్వరరావుగారు, కృష్ణా జిల్లా గుడివాడ పురవాసులైన శ్రీ తుమ్మలపల్లి జ్వాలాపతి, మహాలక్ష్మమ్మ దంపతులకు 1921లో ప్రథమ పుత్రులుగా జన్మించారు. విద్యాభ్యాసం గుడివాడ పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో, రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో జరిగింది. 1942లో ప్రభుత్వ రెవెన్యూశాఖలో చేరి 1950 వరకు పనిచేసారు. తదుపరి 1955 వరకు ఒక ప్రైవేటు కంపెనీలో కార్యనిర్వహణాధి కారిగా పనిచేసారు. ఆ తరువాత 1986వరకు రచనా వ్యాసంగంతోనే జీవనాన్ని కొనసాగించారు. 1988లో శ్రీ శృంగేరి జగద్గురువుల సన్నిధిలో తురీయం అనుగ్రహింపబడి శ్రీ అద్వయానంద భారతీస్వామి అయ్యారు. 1991లో ఆశ్వయుజ శు. అష్టమి (దుర్గాష్టమి) నాడు సిద్ధిని పొందారు.
శ్రీరామలింగేశ్వరరావుగారు, అతి పిన్నవయస్సులోనే శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి అనుగ్రహానికి పాత్రులై శ్రీవిద్యా, బ్రహ్మ విద్యా, యోగవిద్యలందు అధీతి
బోధాచరణ ప్రచారములందు కృతకృత్యులయ్యారు. శ్రీలలితా సహస్రనామ స్తోత్ర భాష్య రచనను తురీయాన్ని స్వీకరించటానికి పూర్వమే 1987లోనే పూర్తిచేసారు. తదుపరి వ్రాతప్రతిని శ్రీమండవ రాఘవయ్య చౌదరిగారికిచ్చారు. కాని కారణాంతరం చేత దానిని వారు ప్రచురించలేకపోవుటచే, శ్రీ అద్వయానంద భారతీస్వామి వారే వ్రాతప్రతిని తెప్పించి తమ శిష్యుల కొకరికిచ్చారు. ఆ తరువాత వ్రాతప్రతి కనుమరుగై 2002 మార్చిలో దొరికింది.