మొదటగా ఈ దైవికమైన పవిత్ర గ్రంధ రచన, సేకరణ, సంకలనాత్మక కర్తనైనా నా గురించి పాఠకదేవుళ్ళకు సవినయంగా మనవి చేసుకోవడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను. నేను నెల్లూరు జిల్లాలోని రావిపాడు గ్రామంలో పుణ్యదంపతులైన కొండపల్లి వెంకయ్య, రుక్మిణమ్మ గార్లకు 1954 వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మ మహాభక్తురాలు, పుణ్యవంతురాలు, సంస్కారవంతురాలు. మా నాన్నగారు కుటుంబ బాధ్యతలతో తలమునకలై ఉండేవారు. 1974 లో మా అమ్మ వైకుంఠప్రాప్తి పొందారు. మా నాన్నగారు వీలున్నప్పుడల్లా ధ్యానానికి నా తోటి శ్రీశైలము, ఘటికాచలము వస్తూ, ఒక మండలము లేక అరమండలము లేక పావు మండలం నాతో ఉండేవారు. నా విద్యాభ్యాసం నెల్లూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ లలో జరిగింది. 1976,1977 వ సంవత్సరాలలో జరిగిన గ్రూప్ - 4 సర్వీసెస్ లో రాష్ట్ర మొదటి ర్యాంకు లోను, గ్రూప్ - 2 విభాగంలోను మామూలు ర్యాంక్ తో ఉద్యోగాలు, పొంది, రాష్ట్ర సచివాలయంలో కొంతకాలము ఉద్యోగం చేశాను. తదుపరి వ్యక్తిగత కారణాల పై గుంటూరు విద్యాశాఖకు బదిలీ పై రావడం జరిగింది. 1983 కార్తీకమాసంలో భగవంతుని ఆరాధించాలి అనే నిరంతర తపన నన్ను ధ్యాన యోగ సాధనకు పురికొల్పింది. 1977 లో నా వివాహం జరిగింది. ఇద్దరు సంతానం ఉన్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. 2011 వ సంవత్సరంలో నేను పదవీ విరమణ చేయడమైంది.
- కొండపల్లి వెంకటేశ్వర్లు