Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అభినందన
పాఠకుడికి చదవాలనే ఉచ్చుకత కలిగించేదే కథ యొక్క ప్రధాన లక్షణం. ఈ కథలు సమకాలీన సామాజిక జీవితానికి సంబంధించినవి కాకపోయినా, పట్టణాలలో ఉన్న నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటున్న గ్రామీణ ప్రజల జీవిత ప్రతిబింబాలే ఈ కథలు.
పల్లెపట్టులలో, నిరు పేదల జీవితాలు అగ్రవర్ణాల ఆధిపత్యాల క్రింది నలిగిపోతున్న విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. అగ్రవర్ణ కామంధులు తమ ఆధిపత్యానికి అనుకూలించని పేదలపై కసిగట్టి ఏవిధంగా కక్ష తీర్చుకుంటారో చాలా కథల్లో మనకు కనిపిస్తుంది.
రచయిత కొత్తపల్లి రామాంజనేయులు గ్రామీణ జీవితానికి అలవాటుపడిన వ్యక్తి కాబట్టి తన జీవిత అనుభవాలను కథల రూపంలో పాఠకులకు అందించినాడేమో అనిపిస్తుంది. ప్రతి కథలో గ్రామాలలో నిరు పేదలు పడుతున్న ఇక్కట్లను, ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు రాయడం జరిగింది. సామాన్యుల జీవితాల పట్ల ఏమాత్రం శ్రద్ధాసక్తులులేని బడారైతులు వారిని తమ వ్యవసాయ పనిముట్లవలె ఉపయోగించుకొను తీరును వాస్తవీకరించాడు రచయిత.
ఈ కథలు అంతర్లీనంగా వ్యవసాయ కూలీలు, రైతులు, పేదలు అన్యోన్యతను కాంక్షిస్తున్నవి. పరోక్షంగా పేదలలో ఉన్న అనైక్యత కారణంగా తామెక్కడికక్కడ చిలువలు పలువలుగా ఇక్కట్లు ఇడుముల పాలౌతున్నారని వారిలో సమైక్య భావన కలగాలని ప్రబోధిస్తున్నవి.
వయోభారాన్ని లెక్కచేయకుండా 34 కథలు అలవోకగా రాసిన కొత్తపల్లి రామాంజనేయులు కలం నుంచి మరిన్ని కథలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.