Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“నీకంటూ ఓ ప్రత్యేకత ఉండాల్సిందే' అనే మా నాన్న రచనా వ్యాసంగాన్ని తన ప్రత్యేకతగా మలుచుకున్నారు. ఆ సరస్వతీ దేవి కటాక్షంగా భావించారు. విద్యార్థులను వెలుగులోకి అంటే జ్ఞాన మార్గం వైపు మళ్ళించే మార్గదర్శిగా నిలిచారు.
'చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు సమాజానికీ, అయిన వారికీ ఎంత భారమో తానొక ఉదాహరణగా' మిగిలిపోయానన్న నేపథ్యం నుండి నేడు మా శివప్రసాద్ గారు.. మా మాస్టారు.. మా శివ.. మా దానం వారు... అంటూ ప్రతి ఒక్కరు సొంత మనిషిగా భావించే స్థాయికి ఎదిగిన మీ జీవిత పయనం స్ఫూర్తిదాయకం. -
ప్రకృతిని ఇష్టపడే నాన్న ఆ ప్రకృతి ఒడిలోకే జారుకున్నారు. చేరాతలు తలరాతలనే మారుస్తాయంటారు. మిమ్మల్ని ఇంత స్థాయికి చేర్చిన మీ చేరాతలే అందుకు నిదర్శనం.
జీవితమే అనుభవాల సంపుటి కదా! అటువంటి ఎన్నో అనుభవాలకు, ఆలోచనలకు అక్షర రూపమే నాన్నగారి రచనలు. పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ, చదువరులను ఆకట్టుకునే నాన్నగారి రచనలకు పుస్తక రూపమే ఈ శివ మానస సౌరభాలు'. మాకు ఇంత గొప్ప సంపదను వదిలి వెళ్ళారు. మీ ప్రతి అక్షరమూ సువర్ణాక్షరమే!
"రాజు జీవించే రాతి విగ్రహము లందు సుకవి జీవించే ప్రజల నాలుకల యందు” అన్నట్లుగా చిరస్థాయిగా నిలిచే మీ రచనలతో ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోతారు.
- దానం శ్రీవిహారి