Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శివలీలలు అనంతాలు. శివరూపాలు అనేకాలు. అటువంటి శివరూపాలలో అర్చనకు వీలుగా ఆగమశాస్త్రాలు అతిముఖ్యమైన ఇరవై అయిదు రూపాలను చెప్పాయి. వాటిని పరమేశ్వరుని పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ రూపాలుగా విభజించి చక్కని కథలను జతచేర్చి సంకలనం చేశారు బ్రహ్మాచార్య. ప్రతి రూపానికి ధ్యానశ్లోకాన్ని, శిల్పాన్ని, కథకు అనువైన చిత్రాన్ని కూడా పుస్తకంలో పొందుపరిచారు. ఈ గ్రంథం భక్తులను పరవశింపచేస్తుంది.
-- నేతి సూర్యనారాయణశర్మ
శ్రీశైలప్రభ మాసపత్రికలో సహాయ సంపాదకుడిగా పని చేస్తూ శివుడిపై భక్తితో... అంతకుమించిన అనురక్తితో దాదాపు రెండేళ్లకు పైగా శివరూపతత్త్వ లీలలను వర్ణిస్తూ చక్కటి ఆధ్యాత్మిక వ్యాసాలను అందించారు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య. పరమేశ్వరుడి లీలా విభూతులను సవివరంగా, సచిత్రంగా తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం బిల్వదళం వంటిది.
- డి.వి.ఆర్.భాస్కర్
పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా?, మరే ఇతర రూపాలు ఆయనకు లేవా... అంటే జగత్తంతా తానే నిండిన స్వామికి గల ఎన్నో రూపాలలో 200లకు పైగా రూపాలను శైవాగమాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో శిల్పశాస్త్రానికి అనుసంధించిన 25 రూపాల వివరాలు ఇందులో ఉన్నాయి.
- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
శ్రీ కందుకూరి వెంకట సత్యబ్రహ్మచార్య గారు ఆగమశాస్త్రంలో, శిల్పశాస్త్రంలో నిపుణులు, బహుభాషా ప్రవీణులు. వీరు అనేక గ్రంధాలను పరిశీలించి, పరమేశ్వరునికి సంబంధించిన రూపాలను పరిశోధించి, అమృత తుల్యమైన ఈ కథలను మనకు అందించారు. శ్రీశైలగద్యం, 25 లీలా క్షేత్రాలతో సహా, క్లుప్తంగా ఈ 25 రూపాల వివరణను ఆంగ్లంలో కూడా వ్రాసి అందించారు. శివ భక్తులకు పరమానందాన్ని కలిగించే ఈ గ్రంథాన్ని తప్పక చదవండి!
- భావరాజు పద్మిని