ఒక సంధికాలపు పదును, కాళ్లను కోస్తుండంగా ఎటువైపు నిలబడాలని నాలో నేనే గింజుకున్నపుడు మౌనంగా ఉండలేక పెకిలించుకున్న విత్తనంలా మగ్గిన ఒక మాట రాలిపడింది.
మూలాన్వేషణకు కూర్చున్నది మొదలు ప్రతి ఆలోచన వెనుక సున్నితపు త్రాసు ఒకటి మొలిచి నన్ను తూకం వేస్తున్నప్పుడు ఊగిసలాటల మధ్య నిలబడ్డ స్పృహను ముంజేతి నుంచి కాగితం మీదకు ఒంపుకున్నాను.
దాన్ని కవిత్వమన్నారు పెద్దలు...
అలా సాగిన స్వరం 'నిక్వణ' రెండేళ్లుగా నన్ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. నావైపు వచ్చిన వెలుగురేఖల ఆదరణ, అభిమానాన్ని కళ్లలో నింపు కున్నాను. దొరికిన కొత్త పరిచయాలు లోకాన్ని చూసే క్షణాల్నే మరింత కొత్తగా స్పర్శిస్తూ చూడడం నేర్పాయి.
నేనీ కొత్త చూపును అద్దుకొని ఇప్పుడు 'శిలాఫలకం'గా నిలబడ్డాను.
శిలాఫలకం ఒక ఎడతెగని వెతుకులాట...
ప్రకటించుకోకుండా నిలబడనివ్వని ఆరాటం...
కునుకు ముందు నీళ్లు జల్లి మేల్కొలిపినట్లుగా ఓ గుంజాటన... అది ఎదురైన సందర్భాలను ప్రకటించే సంతోషమో... దుఃఖమో... ఆవేదననో... ఆక్రోశమో...
ఈ పుస్తకం పేజీల్లో మడతలు మడతలుగా పేర్చాను.