ఆంధ్ర దేశ బ్రాహ్మణులలో వైదికులు - నియోగులు అనే రెండు ముఖ్య శాఖలున్నాయి. మళ్లీ వైదిక శాఖలో ఎన్నోనాడులు , అంతస్మాఖాలు, నియోగి శాఖలో అనేక శాఖలూ ఉన్నాయి, తెలుగు వైదిక బ్రాహ్మణులలో, మాది "ములికినాటి " శాఖ.
ప్రతి రాష్ట్రంలో కూడా ఇల్లాంటి శాఖ బేధాలు కానవస్తున్నాయి. ఈ బేధాలు ఆ రాష్ట్రంలోని ప్రాంత బేధాలను బట్టి వచ్చినాయి. ఆనాటి రాజకీయ పాలనా విభాగాలను సీమ - నాడు అని వ్యవహరించే వాళ్ళు. నాడు అంటే దేశము.
తెలుగు దేశంలో "ములికినాడు " అనే ప్రాంతం అనంతపురం - కడప - చిత్తూరు - బెంగుళూరు జిల్లాల్లోని కొన్ని భాగాలతో కూడిన ప్రదేశము. ఈ ప్రాంతానికి కడప జిల్లా పులివెందుల తాలుక "మోపూరు" రాజధానిగా ఉండేది. ఇప్పుడది ఒక కుగ్రామం. అక్కడ ఎత్తయిన భైరవ విగ్రహాం పూజలందుకుంటున్నది. పామర జనాలు ఈ స్వామిని మోమారు బయ్యన్న అంటారు. ఆ ప్రాంతీయులు తమ బిడ్డలకు బయ్యన్న - బయ్యమ్మ అని పేర్లు పెట్టుకుంటారు.