Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కవిమాట! ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు! మానవ జన్మను పొందిన ప్రతీవ్యక్తీ, “దైవభక్తి” ని పెంపొందించుకొని, ఉన్నతమైన విద్యను అభ్యసించి, విశ్వం మెచ్చే మనిషిగా ఎదగాలనే ఆకాంక్షతో ఈ గోవింద, ఛాతీ, విశ్వజన శతకాలను “శతకత్రయం ” అనే పేరుతో రచించడం జరిగింది.
ఇందులో గల గోవింద (111), ఛాత్ర (108) శతకాలను కందవృత్తంలో, విశ్వజన శతకాన్ని (108) ఆటవెలది వృత్తంలో వ్రాయడం జరిగింది. వీనిలో గల మొత్తం పద్యాలు 327. వీటిలో అనేకమైన భక్తులు, ఋషులు, త్యాగధనులు, మహానుభావుల ప్రమాణాలను పొందుపరచి, వారికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆయా పద్యాల యొక్క భావాలు తరువాత వ్రాయడం జరిగింది. పద్య రచనలో సిద్ధహస్తులైన, సరస్వతీ ప్రతిరూపులైన ఎందరో ప్రాచీన, ఆధునిక కవుల కావ్యాలతో పులకించిన ఈ భారతావనిలో పుట్టి, తెలుగు చదివి, తెలుగు కవిత తెలిసిన వారిలో ఒకనిగా నిల్చుని, జన్మసార్ధక్యత కోసం చేసిన ప్రయత్నమే ఈ “శతకత్రయం ”. ఈ ప్రయత్నంలో నేను పూర్వకవుల పద్యాల జిగిబిగిని అందుకోలేకపోవచ్చు. అలంకారాల మధురిమను అందించలేకపోవచ్చు, కానీ నేటి విద్యార్థుల స్థాయిని బట్టి అనేక మహానుభావులను ప్రమాణాలుగా, సచిత్రయుతంగా వారికి పరిచయం చేస్తూ, వాటికి సామెతలను రంగరించి చేసిన ఈ ప్రయత్నాన్ని పాఠకలోకం సహృదయంతో ఆస్వాదిస్తుందని ఆశిస్తున్నాను.
భక్తి మార్గానికి దూరమై, చదువుకునే వయసులోనే అనేక చెడ్డ అలవాట్లకు లోనౌతున్న విద్యార్థి లోకానికి ఈ రచన మార్గదర్శకం కాగలదని భావిస్తున్నాను. "గోవిందశతకం” భక్తి మార్గ సూచకమైతే, “ఛాత్రతకం” విద్యార్థులకు సన్మార్గ వీక్షణం! ఇక “విశ్వజన శతకం” 108 సామెతల ఆధారంగా సాగినదై, ఆ బాల గోపాలానికి అనువైనదిగా, అవసరమైనదిగా మలచబడిన ప్రయత్నం! ఈ మూడింటిని విద్యార్థులతో పాటు పాఠకలోకమంతా చదివి, ఆకళింపు చేసుకొని నా యీ ప్రయత్నాన్ని సార్ధకం చేస్తారని మనవి. సామెతలతో పాటు జాతీయాలు కూడా ఇదే పుస్తకంలో ఉంటే బాగుంటుందని కొసమెరుపుగా చేసిన ప్రయత్నమే "జీవన జాతీయం”. ఆస్వాదించి ఆశీర్వదించండి. కృతజ్ఞత :- ఈ శతకత్రయాన్ని చూసి ఆశీర్వదించిన అందరికీ త్రికరణశుద్ధిగా నమస్కార పూర్వక కృతజ్ఞతలు. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వంశ ఋషులకు, గురువులకు అనేక కృతజ్ఞతలు!అదే విధంగా ఈ రచనను పరిశీలించి గుణదోష సూచన చేసి, ఆశీఃపూర్వక అభిప్రాయమార్గదర్శకత్వాన్ని చేసిన గురుసహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాదుగారికి, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ కోట నరసింహం అవధానిగారికి, శ్రీ రసరాజుగారికి, శ్రీ సూర్యనారాయణ మాష్టారు గారికి, శ్రీ సుశర్మ గారికి, శ్రీ అయ్యల సోమయాజుల శ్రీ రామమూర్తి బావగారికి అనేక కృతజ్ఞతాభివందనాలు.