అనాదియైన అవిద్యతో కూడింది, శీతోష్ణ సుఖ దుఃఖాది అనేక ద్వంద్వాలతో నిండింది, జనన మరణ ప్రవాహ రూపం, సచ్చిదానందాత్మకమైన పరబ్రహ్మ జ్ఞానంచే నివర్తింపబడేది అయిన ఈ సంసారమందు కొట్టుమిట్టాడుచున్న మానవులందరికీ కోరదగిన ప్రయోజనాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. ఇవి పురుషులు కోరదగినవి కనుక వీటికి పురుషార్ధాలు అను పేరు సార్థకంగా ఉంది. వీటిలో మొదటి మూడింటిని త్రివర్గమని, మొత్తం నాల్గింటిని చతుర్వర్గమని ప్రాచీనులు వ్యవహరించారు .