భారతదేశం సర్వసత్తాక ప్రజాతంత్ర దేశమయి స్వాతంత్ర్య దాస్యశృంఖలాలు తెంచుకొన్నచప్పుడు వినబడుతున్నప్పుడు, ప్రజాస్వామ్యం ప్రజాభాస్కరులతో ప్రకాశిస్తుందనుకొంటున్నప్పుడు, అసామాన్య సామాన్యంగా రాజ్యాంగదీపం వెలుగులీనుతుందనుకొన్నప్పుడు, సమానత్వ భవనాలు నిండి గాలి తోలుతున్నప్పుడు, మనుషులంతా సోదరులుగా మనసులు మమతలు పంచుకొంటా రనుకోనప్పుడు, కొత్తగా మేల్కొన్న స్వాతంత్ర్య మేఘాలు ఆకాశాన్ని కమ్ముకొన్నప్పుడు, సాంఘిక న్యాయం సాధ్యమనే ఊహ హృదయాలను ఉర్రుత లుపుతున్నప్పుడు, ఆర్ధిక న్యాయం అనివార్యమని మనుషుల కళ్ళను గుండెలమీద పెట్టుకొన్న నేలతల్లి కొత్త దుముమురేపుతున్నప్పుడు, భారతదేశంలో, ప్రాచీన ద్రావిడ భాగంలో, తెలుగు ప్రజలున్న ప్రాంతంలో, గుంటూరు జిల్లాలో, వేజండ్ల గ్రామంలో, కూలీనాలీ చేసి పొట్ట పోసుకొనే మాదిగ పల్లెలోని ఒక పసిబిడ్డ చదువుకోవాలన్న ఆబ గుండెల్లో దట్టించుకొని, ఆశముట్టించుకొని, కళ్ళు వెలిగించుకొన్న సందర్భ సమయం 'రంధి' నవలా కథా కాలం.
- ఆచార్య కొలకలూరి ఇనాక్