Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹110

                                       జర్నలిస్ట్ మిత్రుడి గురించో మాట..... ఆయన జర్నలిజంలోకి అడుగు పెట్టి. 40 ఏళ్లు దాటింది. జర్నలిజంకు సంబంధించిన ఏ అంశంలోనైనా సరే... కాగితం మీద కలం పెట్టాల్సి వచ్చినప్పుడు... మొదటి రోజున ఎంత ఉత్సాహమో... ఇప్పుడూ అదే ఊపు. ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను. రాతలోని వాడి.. వేడి, మెరుపులు... మెలికలు... వ్యంగ్యమూ ఇప్పటికీ తగ్గకపోవడం భోగాదికే చెల్లిందేమో...! ఈ 40 సంవత్సరాల కాలంలో, - సగానికి పైగా ఉభయగోదావరి జిల్లాలతోనే ఆయన పత్రికా వ్యాసంగం పెనవేసుకుపోయింది. ఆంధ్రజ్యోతి విలేకరిగా పశ్చిమ గోదావరిలోను; ఉదయం విలేకరిగా తూర్పుగోదావరి జిల్లాలోను ఆయన వెలురించిన కథనాలు; ఇన్నేళ్ల తరువాత కూడా - ఈ రెండు జిల్లాల్లోని వార్తాప్రియులకు గుర్తుండి పోవడం విశేషం. ఆ రోజుల్లో భోగాది వేంకట రాయుడు అంటే పాఠక లోకంలో ఒక క్రేజ్. ఒక సంచలనం. ఒక మామూలు విలేకరిగా ఆయన రాసినన్ని పరిశోధనా కథనాలు మరెవరూ రాయలేదంటే అతిశయోక్తి కాదు. 'ఉదయం' దినపత్రిక దాసరి నారాయణరావు చేజారడంతోనే... భోగాది వేంకటరాయుడి కలం కూడా మొద్దుబారి పోయిందేమోననుకుంటాను. ఆ తరువాత ఆయన వృత్తి జీవితం కూడా గతుకుల మయమైపోయినట్టు ఉంది. ఒక అడుగు ముందుకు - రెండు అడుగులు వెనక్కూ. ఉదయం తరువాత చాలా పత్రికలలో చాలా అవతారాలు ఎత్తారు గాని, ఎక్కడా పట్టుమని పది రోజులు నిలబడిన దాఖలాలు లేవు. ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రప్రభ... ఇలా అన్ని కార్యాలయాలను చుట్టేశారు.

                                      నోటిని, తలతిక్కను కొంత అదుపులో పెట్టుకొని ఉన్నట్టయితే... జర్నలిస్టుగా చేరగలిగినంత ఎత్తులకు చేరి ఉండేవారని కూడా అనుకుంటున్నాను. డబ్బు... గౌరవం అనే రెండింటిలో జర్నలిస్టులు ఏదో ఒకటి వదిలేసుకోవాలని గట్టిగా నమ్మే భోగాది; మొదటి దానిని వదిలేశారు. రెండోదానికి, ఒక కిలో వంకాయలు వస్తాయా అని బేబిగారు (వాళ్ళావిడ) చురకలేస్తుండేది. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా భోగాది వేంకటరాయుడు విశేష కృషి చేశారు. 1983లో ఏలూరులో, గ్రామీణ విలేకరుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. గ్రామీణ విలేకర్ల సమస్యలు వెలుగులోకి రావడం అప్పుటినుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఎపియుడబ్ల్యుజే) వినియోగించే లోగోను ఆ సభల కోసం రూపొందించింది. మిత్రుడు, సీనియర్ సహచరుడు భోగాది అందిస్తున్న తన పాత్రికేయ అనుభవసార సంగ్రహాన్ని ఆస్వాదించే తీరిక, ఓపిక - నేటి కాలపు జర్నలిస్ట్ మిత్రులకు ఉండాలని కోరుకోవడంలో అత్యాశ ఏమి లేదు కదా!

                                                                                                                                                                                                                                                                              - డి.సోమసుందర్