Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పాతికేళ్లకన్నా 1994లో ముందు రాసిన ఈ పుస్తకం మరోసారి పాఠకులు చేతుల్లోకి రావడం చాలా చాలా సంతోషకరమైన సముచితమైన సందర్భం. దీన్ని అమితంగా ప్రేమించి, సాంసృతిక రంగ కార్యకర్తల చేతుల్లో ఎప్పుడూ వుండాలని కోరుకునే మిత్రుడు సత్యరంజన్, కృష్ణాజిల్లా సాహితీ స్రవంతి మిత్రులు,శ్రేయోభిలాషసులు ఇందుకు కారణం. విజయవాడలో సాహితీస్రవంతి రాష్ట్రకేంద్ర కార్యాలయ ప్రారంభ సమయంలో దీన్ని మళ్లీ తీసుకురావాలని వారు సంకల్పించారు. తమ చొరవతోనే తీసుకొస్తున్నారు. ఇందుకు వారికి అభినందనలు. ఇక్కడొక చిన్న వ్యక్తిగత విషయం. అప్పట్లో సత్యరంజన్ సోదరుడు నిరంజన్ ప్రజాశక్తి బుక్ హౌస్ బాధ్యుడుగా వుండేవారు. రెండు ముద్రణలు తన ఆధ్వర్యంలో వెలువడ్డాయి. ప్రజానాట్యమండలి రేపల్లెలో నిర్వహించిన తరగతులలో చెప్పిన పాఠాన్ని విస్తరించి ప్రజాశక్తిలో ధారావాహికంగా వేశాము. అదే తర్వాత పుస్తకమైంది.
ప్రచార రంగంలో వర్గపోరాటం రాసిన నాటికి కేబుల్ టీవీ అప్పుడప్పుడే మొదలవుతున్నది. మతతత్వ రాజకీయాల ప్రాబల్యం, సరళీకరణ విధానాలు మొదలవుతున్నాయి. స్వాతంత్రానికి చేటు తెచ్చేనూతన ఆర్థిక విధానాలు పేరిట నేను రాసిన చిన్న బుక్ అప్పట్లో లక్ష ప్రతుల వరకూ ముద్రించడం ఇప్పుడు గుర్తుకు వస్తుంది. సాహిత్య సాంసృతిక రంగాలలో కర్తవ్యాలు, ఆర్థిక రాజకీయ పరిణామాల మధ్య అంతస్సబంఢం మరోసారి చెప్పుకోవడం అవసరమనిపించింది.దానికి స్థానిక ఉదాహరణలు మన చరిత్రలోని అనుభవాలు ,ఉదాహరణలు తప్పనిసరి. భారతీయ తాత్విక చరిత్రలో లోకాయతులు చార్వాకులు కూడా వున్నారన్న సంగతిని పాలకవర్గం తొక్కిపడుతుంది. అలాగే తెలుగు సాహిత్య సాంసృతిక వికాసంలో ప్రత్యామ్నాయ శక్తుల పాత్రను ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టుల కృషిని కప్పిపుచ్చుతుంది. ప్రస్తుతం మీడియాను సినిమాను ఏలుతున్న వారిలో అత్యధికుల మూలాలు అక్కడే తేలతాయి. అది మరో పరిశోధన.