"పొట్ట " భద్రులారా!
"కోటి విద్యలు కూటి కొరకే " అంటారు। ఆందులో రెండు విద్యలు నావి। నవ్వించేట్టు రాయడం నా వృత్తి। నవ్వించేట్టు మాట్లాడడం నా ప్రవృతి। ఈ రెండు జానెడు పొట్టమీద ప్రభావం చూపించేవే। అందుకే
పొట్టోత్సాహము మనిషికి
పొట్టను పెంచేసినపుడే పుట్టదు జనులా
పొట్టను కనుగొని నవ్వగ
పొట్టోత్సాహమ్ము నాడు పుట్టును సుమతి " అన్నాను
సుమతి శతకాన్ని కూడా ఎదో పూర్వ జన్మలో నేనే రాశానని నా ప్రగాఢమైన శాస్త్రీయమైన, హేతుబద్దమైన మూఢ విశ్వాసం। అందుకే నా వ్యాసాల్లో పొట్టాభిషేకానికి పట్టం కట్టి మిగిలిన వ్యాసాలను కలిపి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నాను। వినాయకుడు నాకు అడుగుజాడ। పొట్ట ఉండడం వల్లనే వినాయకుడు అద్భుతంగా గెలిచాడని నా నమ్మకం। అందుకే నేను పొట్ట పెంచాను। నమ్మితే నమ్మండి। నవ్వితే నవ్వండి।