Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీ బాలం వెంకట్రావు మూడు దశాబ్దాలుగా నాకు తెలుసు. మంచి స్నేహశీలి. ఏడు దశాబాల వయసులో మొదటిసారి తన కథానికల సంపుటిని వెలుగులోకి తేవాలనుకున్నాడు. రచయితలు, రచయిత్రులు, కవులు ఎవరయినాగాని తమ రచనలను గ్రంథరూపంలో చూసుకోవాలని తాపత్రయపడతారు. అందులోనూ పత్రికలు అనేకం మూతబడుతున్న సందర్భం. ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్న పత్రికలు. అతికొద్ది వార, మాస పత్రికలు మాత్రమే వస్తున్నాయి. తెలుగు భాష పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని అందరూ వాపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ ఇక కొంతకాలం ముద్రిత గ్రంథాలకు మంచిరోజులు వస్తాయని ఆశావాదులు అంటున్నారు. అందుకే మిత్రుని గ్రంథానికి స్వాగతం పలుకుదాం.
ఈ సంపుటికి ముందుమాట రాయమని నన్ను అడిగినప్పుడు నేను కాదనలేక పోయాను. అందుకు మా స్నేహబంధం కారణం. మొదటిసారి నేను బాలం వెంకట్రావు 'ఒరేయ్' కథానిక చదివాను. అప్పట్లో ఆ కథానిక ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చినప్పుడు అనేక మంది ప్రశంసలను పొందింది. తర్వాత ఒకటి రెండు కథానికలను మించి నేను చదవలేదు. ఇప్పుడు ఇరవై రెండు కథానికలు ఇందులో వున్నాయి. అన్నింటినీ చదివాను.
ఇందులోని కథానికల్ని నేను వివరంగా పరిచయం చేయాలని అనుకోవటంలేదు. వీటిని పాఠకులు చదవాలి. ఓ అభిప్రాయానికి రావాలి. అందుకు వారధిగా మాత్రం ముందుమాట వుండాలి.
ఈ కథానికల్లో ఎక్కువ భాగం డెబ్బైవ దశకంలో రాసినవి. అంటే నలభై అయిదు సంవత్సరాలు దాటిపోయాయి. ఆ రకంగా ఈ కథానికలకు ఆ పరిమితి వుంటుంది. వుంది. అవన్నీ ఇప్పుడు అవసరమా అంటే కాదని ఎలా అనగలం. ఆనాడు మానవ సంబంధాలు ఎలా వున్నాయి. ఆర్ధిక పరిస్థితులు, పల్లెలు, పట్నాలు ఏ రకంగా వున్నాయి. ప్రకృతిని అప్పటికే విచక్షణారహితంగా ధ్వంసం చేస్తున్నారా? ఆధునికంగా వస్తున్న మార్పులు వ్యక్తుల, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకువస్తున్నాయి .