Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పక్కలో బల్లెం
"నేనింకా ఎన్ని రోజులుండాలీ హాస్పటల్లో మిస్ స్వీట్?”
శ్రీదేవి, బెడ్ మీద కూర్చుని నర్స్ స్వీట్ ను విసుగ్గా అడిగింది. స్పాంజిని వేడినీళ్ళతో తడిపి, రోగికి ఒళ్ళు తుడుస్తున్న నర్స్, ముఖంలోకి లేని చిరునవ్వు తెచ్చుకుని -
“ఇక్కడ మీకు కష్టంగా వుందా మేడం?" అడిగింది. “కష్టం లేదు గాని చెప్పు - నేనెప్పుడు వెళ్ళొచ్చు?" “ఆ సంగతి డాక్టర్ గారు చెప్పాలి, వారిప్పుడు వస్తారు - అడగండి."
“మిస్ స్వీట్, ఆమె ఒళ్ళంతా స్పాంజ్ తో పరిశుభ్రంగా తుడిచి - కొత్త ఇస్త్రీ చీరను కట్టబెట్టి, కురులు దువ్వి ముడివేస్తుండగా డాక్టర్ సురాజ్, లోన ప్రవేశించాడు. రోగి యొక్క కళ్ళలోని నెత్తురు, గుండెలు పరీక్షించి -
“మీ ఆరోగ్యమిప్పుడు బాగానే వుంది” అన్నాడు. "నేనింటికి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు డాక్టర్!" శ్రీదేవి అడిగింది.
"వెళ్ళచ్చు - కాని చాలా జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా తిండి విషయంలో - చాలా జాగ్రత్తగా వుండాలి. ఏదిపడితే అది తినకూడదు. మీకీ గెస్టిక్ ట్రబుల్ తిరగబెట్టడమిది మూడోసారి. మరోసారి తిరగబెట్టిందంటే మనవశం కాదు. వింటున్నారా?"
“అంతగా చెప్పడానికి నేను పసిబిడ్డను గాను చూడండి."