“తాతయ్యా! ఈరోజు ఏం కథ చెబుతావ్?” ఉత్సాహంగా అడిగాడు శంకరం.
“ఏం కథ చెప్పమంటావ్?” తన చుట్టూ చేరి ఆత్రంగా తనకేసే చూస్తున్న పిల్లల ముఖకవళికలను పరిశీలిస్తూ అడిగాడు వారందరిచేతా తాతయ్య అని పిలవబడే వెంకటరామయ్య.
"రామాయణం, భారతం, భాగవతం కథలు ఎప్పుడో చెప్పేశావు తాతయ్యా! ” అంది యమున.
“కాశీమజిలీ కథలు, సహస్ర శిరచ్ఛేద చింతామణి, బాలనాగమ్మ కూడా అయిపోయాయి” అంది రంజిత కళ్ళు చక్రాల్లా తిప్పుతూ.
“అన్ని కథలు అయిపోయాయి. చివరకు సింద్ బాద్ సాహస కధలు కూడా అయి పోయాయి.” అన్నాడు రవితేజ.
“అవును...!” అన్నాడు తాతయ్య చిన్నగా నవ్వుతూ.
“అయినా కధలన్నీ మనదేశంలోనే జరుగుతాయా? మిగిలిన దేశాల్లో వాళ్ళు కూడా మన కథలే చెప్పుకుంటారా తాతయ్యా?” అడిగాడు నారాయణ అమాయకంగా,