బడి అంటూ ఒకటి పెట్టి, అందులో పిల్లల్ని కూర్చోబెట్టి చదువు అనేది నేర్పడమనే కసరత్తు చరిత్రలో ఎప్పుడు మొదలైందో కానీ, మానవేతిహాసంలో అది మాత్రం దుర్ముహూర్తాల్లోకెల్లా దుర్ముహూర్తం. ఈ బడి ఎన్ని భావోద్వేగాల్ని మంట కలిపిందో, ఎంత సృజనాత్మకతను పాతర పెట్టిందో, ఎన్ని ఆలోచనలను మొగ్గలోనే తుంచేసిందో, ఎన్ని హక్కుల్ని కాలరాసిందో, ఎవ్వరూ తూకం వేయలేని ఎంత విషాదాన్ని బాల్యానికి బలవంతంగా అంటగట్టిందో చెప్పగలిగిన వారెవ్వరూ లేరు. ఇది మహా మహా ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదం కన్నా పెద్ద విషాదం. మహా ప్రళయాలు సృష్టించిన బీభత్సం కన్నా పెద్ద బీభత్సం.
ఈ మధ్య అమెరికాలో ఒక యువకుడు ఇదే ఆవేదనతో బడి మీద కోర్టులో వ్యాజ్యం వేసి, బడిలో జరుగుతున్నదంతా పెద్ద క్రిమినల్ చర్య అంటాడు. గత 150 ఏళ్లలో మన చుట్టూ ఉన్న ప్రతిదీ మారింది కానీ, బడి మాత్రం మారలేదని వాపోతాడు.
- సి. వి. కృష్ణయ్య