తెలుగు భాషా సాహిత్యాల పరిస్థితి ఏమౌతుందో అని ఆందోళన పడుతున్న సమయంలో ఈ 'నవలా నాయికలు' వ్యాసాల కూర్పు ఒక ఊరటనిచ్చే ప్రయోగంగా భావిస్తున్నాం. సాహిత్యం జీవితాన్ని మరింత విలువైనదిగా తీర్చిదిద్దుకోడానికి ప్రధాన ఉపకరణంగా భావించే మలితరం యువత, ఆశాదీపాల్లా ముఖ పుస్తకం నిండా కనిపిస్తున్నారు. పుస్తకం పట్ల శ్రద్ధ, భక్తి తత్పరతలు కలిగిన, వారిని ఒక వేదిక మీదకు తెచ్చి అందరి ముందూ నిలిపే ప్రయత్నమే ఇది.
రాబోయేతరాలకు తెలుగు సాహిత్య పఠనం పట్ల కుతూహలాన్ని, ఆసక్తినీ రేకెత్తించడమే కాక వెయ్యేళ్ళ సాహిత్య భాండాగారపు తాళం చెవుల గుత్తి వారిచేతిలో పెట్టి భద్ర పరచమనే బాధ్యత అప్పగించే ప్రయత్నం కూడా. ప్రయత్నం ఏవేపు నుంచి మొదలు పెట్టినా అది వెలుగుల ప్రస్థానానికి దారితీసే బాటే. అలా విద్యావంతులైన, నగరవాసు లయిన - సాహిత్యానుభవంతో తమను, సమాజాన్నీ అర్థం చేసుకుంటున్న 'నవ యువతులను ఎన్నుకోవడంతో ఈ ప్రయోగం మొదలయింది. ఈ ఆరంభ కార్యాచరణ అంతా కె. ఎన్. మల్లీశ్వరిదే.
- వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, కె. ఎన్. మల్లీశ్వరి