మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అనగానే మనకు చక్కటి తెలుగుదనం కళ్లకు కడుతుంది. కనుపాప కరువైన కనులెందుకో.... వంటి సుప్రసిద్ధ సినీగీతాలు మదిలో మెదులుతాయి. ఎన్నో సినీ సంభాషణలు చెవుల్లో మారుమోగుతాయి. డు-ము-పు-లు వంటి కథలు మనోఫలకం మీద కదలాడుతాయి. కృష్ణా తీరం వంటి నవలలు గుర్తొస్తాయి. తెలుగు నుడికి పట్టం కట్టిన అచ్చ తెలుగు రచయిత, కవి మల్లాది.
అన్నప్ప, యెగ్గెన్న, బుచ్చన్న, రామశేషు, రాజమ్మ, సదాశివుడు, రత్తమ్మ - కవటాకు, తవ్వెడు గింజలు, ఇద్దరి - అద్దరి, పెద్దపీట... ఇలాంటి పేర్లు, పదాలు ఇదోలోకం. ఈ లోకం చూడాలంటే 'కృష్ణా తీరంలోకి ప్రేవేశించాల్సిందే. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు రాసిన ఈ నవల 1967 నాటిది. ఈ నవలలోని పాత్రల పేర్లే కాదు, వాటి తీర్లూ చిత్రమై నవే. శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడని పేరున్న అన్నప్ప గారు శూద్ర లచ్చిని 'నువ్వు నా కూతురివి.. మా రెండో పిల్లవు' అంటాడు. నిజానికి లచ్చి ఆయన కూతురు కాదు. సుబ్బరామయ్యని చావచితక తన్నిన బుచ్చన్న, అతన్నే ఎంతో ప్రేమగా 'బావా' అంటాడు. ఇవి ఈ నవలలో మలుపులు, ఆశ్చర్యాలూ కావు. మనసున్న మనుషుల నిండైన ప్రవర్తనలు.. మనస్తత్వ చిత్రణకి మణిదీపాలు
- వి. రాజరామమోహనరావు