Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రస్తావన స్కంధత్రయాత్మక జ్యోతిశ్శాస్త్రములో సంహితాస్కంధమందు ముహూర్తభాగ మంతర్భూతము. ఈ ముహూర్తభాగమందు సమస్త వైదిక లౌకిక క్రియలకు శుభకాల నిర్ణయమును చేయుటకు శ్రీరామదైవజ్ఞులు “ముహూర్తచింతామణి" యను గ్రంథమును రచించెను. ఈ గ్రంథమునకు నీలకంఠదైవజ్ఞ చక్ర చూడామణి యొక్క కుమారుడగు గోవింద దైవజ్ఞుడు “పీయూషధార” యను సంస్కృత వ్యాఖ్యను అత్యంత విపులముగ వ్రాసియుండెను. ఇది మహత్తరమైన మహూర్త గ్రంథమగుట చేత, దీనిని సులభశైలిలో సంస్కృత భాషా జ్ఞానములేని వారి సౌకర్యము కొరకు చిరంజీవులైన మారేపల్లి రామవీరేశ్వరశర్మ గారి సంపూర్ణ సహకారముతో ఆంధ్రాను వాదము చేయుచుంటిని. ముందుగ ఈ భాగమందు శుభాశుభ ప్రకరణము - నక్షత్రప్రకరణము - సంక్రాంతి ప్రకరణము అను 3 ప్రకరణములను ప్రధమ భాగముగ ప్రకటించితిని. రెండవ భాగమందు గోచార, సంస్కార, వివాహ ప్రకరణము, వధూప్రవేశ, ద్విరాగమ, ఆగ్న్యాధాన ప్రకరణములు వచ్చును.
తృతీయ భాగమందు రాజాభిషేక - యాత్రలను 2 ప్రకరణములు వచ్చును. నాలుగవ భాగమందు వాస్తు ప్రకరణము - గృహప్రవేశ ప్రకరణములు. గ్రంథకర్త యగు శ్రీరామదైవజ్ఞ వంశవర్ణనముతోగల ప్రకరణములు వచ్చును. మొత్తము 14 అధ్యాయములతో కూడిన గ్రంథమందు సమగ్ర విషయ విచారణ చేయు సంకల్పముతో 4 భాగాలుగా విడదీయడమైనది. పెద్ద గ్రంథముగ ప్రకటించవలెనన్నచో విశేష ధన వ్యయప్రయాసలతో కూడినదియేగాక గ్రంథమూల్య మధికమైనచో గ్రంథమును సంపాదించుకొను వారికి కూడ శ్రమ కలుగుననే భావముతో నీ పద్దతి నవలంబించితిమి.
మ||రా||శ్రీ వల్లభోజు పద్మయ్యాచారి, శ్రీమతి దుర్గాంబగార్లు మరియు వారి ప్రధమ, తృతీయ కుమారులు శ్రీ శ్రీనివాసాచారి, ప్రభాకరాచారిగార్లు ఏకస్టులై కీర్తిశేషులైన సుధాకరాచారిగారి జ్ఞాపకార్థము, లోకోపకారార్థము యీ గ్రంథమును ముద్రించుటకు సంపూర్ణ ద్రవ్య సహాయమును చేసిరి. సృష్టికర్తయగు శ్రీ విశ్వకర్మ మహానుభావుల అనుగ్రహాశీస్సులు వీరి కుటుంబ సభ్యులకెల్లకాల మందు కలుగవలెనని ఆశించుచున్నాము.
ఇట్లు
మధుర కృష్ణమూర్తి శాస్త్రి
డా॥ మారేపల్లి రామవీరేశ్వరశర్మ