Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
నాలుగు నుడుగులు
ఈ 'మేరల కావల' తీసుకొని రావడానికి ఆరు నెలలు పాటు పడవలసి వచ్చింది. 2014 నవంబరులో 'మల్లవరపు వెలువరింతలు' పేరుతో సిలువగుడి కతలు, కతల గంప అనే రెండు కతల పొత్తాలను వెలువరించినారు పూదోట శౌరీలక్క అప్పుడే, ఏడాదికి ఒక పొత్తాన్నన్నా వెలువరించాలని వారు అనినారు. కొద్దిగా జాగు అయినా ఇప్పుడిది వచ్చింది.
'ఒక నుడి లోకనుడిగా ఎదగాలంటే, ఆ నుడిలో కొన్ని గొప్ప పనులు జరగాలి. లోకంలోని అన్ని తావుల బతుకులూ ఆ నుడిలో వెలువడడం, అటువంటి పనులలో ఒకటి. ఇంగిలీసు, పరాసు వంటి నుడులను నేర్చుకొంటే లోకాన్ని చదివినట్లే కదా. అటువంటి తడవు తెలుగుకు కూడా ఉంది. చాలా కొద్ది నుడులలాగా, తెలుగు కూడా లోకంలోని ఎన్నో దేశాలలో పరచుకొని ఉంది. మన దేశంలోని గుజరాతీల కంటే పంజాబీల కంటే తమిళుల కంటే ఎక్కువగా, తెలుగువారు పలునాడులలో, పలు దేశాలలో, పలు తరాలుగా కుదురుకొని ఉన్నారు. పద్దెనిమిది కోట్ల తెలుగుజాతిలో సరిగ్గా సగం మంది తెలంగాణాంధ్రలకు బయటే ఉన్నారు.
అయితే తమిళంలో వచ్చినట్లుగా తెలుగులో, బయటి నుండి నానుడి (సాహిత్యం ) రాలేదు. లోకం అంతా కలిపి 5 కోట్లకు లోపల ఉండే తమిళనుడిలో, సింగపూరు, మలేసియా, మారిషసు, బర్మా, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి ఎన్నో బయటి దేశాల 'బతుకులను చదువుకోవచ్చు. పేరుకు 18 కోట్ల తెలుగు జాతే కానీ, అనువాదాల్లో కాకుండా నేరుగా బయటి బతుకులను తెలుగులో చదవడం అన్నది కుదరని పని. అటువంటి నానుడి తెలుగులో చాలా చాలా అరుదు.
'తెలంగాణాంధ్రలకు బయట ఉంటున్న తెలుగువారు రెండు తీరులు. “మీది కానీ, మీ పెద్దలది కానీ సొంతవూరు ఏది' అని అడిగితే, ఆ అడకకు మారుగా,
ఇప్పటి తెలంగాణాంధ్రలలోని ఊరి పేరును చెప్పేవారు వలస తెలుగులు. 'తెలంగాణాంధ్రలకు బయటి ఊరి పేరును చెప్పేవారు వలతి తెలుగులు.