Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
సుస్మిత అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. అదే, 'కొత్తావకాయ' అంటేనో... రక్కున గుర్తుపట్టేస్తారు. 'కొత్తావకాయ' అంతటి రుచికరమైన కలం పేరుతో బ్లాగును నిర్వహిస్తూ సాహిత్య ప్రియులకు చేరువైన రచయిత్రి సుస్మిత. రాయడంకన్నా చదవడం ఎక్కువ ఇష్టపడతారు కనుక ఆమె రాసింది తక్కువే అయినా రాసినవన్నీ వెబ్ పాఠకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఆమె 'గాలిసంకెళ్లు' నవల 'కౌముది' వెబ్ పత్రికలో, కొన్ని కథలు 'తానా' ప్రత్యేక సంచికల్లో ప్రచురితమయ్యాయి. --
'కొత్తావకాయ' సుస్మిత అసలు ఊరు విజయనగరం. ప్రస్తుత నివాసం అమెరికా. ఇంట్లో పెద్దలు సంస్కృతాంధ్ర పండితులు కావడంతో చిన్న వయసులోనే సంప్రదాయ సాహిత్యంతో, ప్రబంధాలతో పరిచయమైంది. ఆ తర్వాత సహజంగానే తెలుగు సాహిత్యంపై ప్రేమాభిమానాలు గాఢమ య్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళాక ఆంగ్ల సాహిత్యం చేరువైంది. ఇక ప్రవాసంలో తెలుగు అక్షరాలని వెతుక్కునే క్రమంలో పదిహేను ఏళ్ళ క్రితం తెలుగు బ్లాగులు పరిచయమయ్యాయి. అటు పైన తన సొంత బ్లాగు kothavakaya.blogspot.comని ఆరంభించి కబుర్లని, కథల్నీ తెలుగు వారితో పంచుకోవడం ఆరంభించారు. తన 'బలగం' కథ చదివి కారా మేష్టారు స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకుంటూ మాట్లాడడం ఎప్పటికీ మర్చి పోలేని జ్ఞాపకమని చెబుతారామె. 'తిరుప్పావై'తో ప్రేమలో పడి తన బ్లాగులో ఆమె రాసిన పాశుర కథామాలికకు పుస్తకరూపమే ఈ 'మంచి వెన్నెలవేళ'. అచ్చులో ఇది ఆమె తొలిపుస్తకం. -