నిరుపేద ఎప్పుడూ ధనిక స్వామ్యానికి ఎందువల్ల ఫుట్ రెస్ట్ గానే ఉపయోగపడతాడో, ఆ పేద ఇంట్లో ఒక మూగజీవి అమృతం తాగుతూ అక్కడే ఎందువల్ల ఉండిపోయిందో, ఆ బాలుడు తన ప్రస్తుత స్థాయిని
అధిగమించి తన పాఠశాలలో మొదటివాడుగా ఎలా వచ్చాడో, తప్పనిసరిగా తెలుసుకోవలసిన జరూరు నిర్ణయం కుడిఎడమలుగా అమలులో కొస్తే, అంకెల పిచ్చోడికి అంతిమస్థానం ఎక్కడ దఖలు పడుతుందో, తన కుటుంబానికి పెద్ద దిక్కు లేని లోటును పసిహస్తం ఎలా పూరించాలను కుందో, తరాలు దాటి ఎదుగుతున్నా సరే వాళ్ళు తమ మనసులను ఎక్కడ పాతరేసుకుంటున్నారో, దేవుడి నగలను ఏ దివ్యశక్తి కాపాడిందో, సమస్యలకోసం వెంపర్లాడుతున్న దంపతులకు ఏ చెట్టు కింద జ్ఞానోదయం కలిగిందో, మద్యపాన వ్యసనం నుండి ఆ నడి వయస్కుడు ఏ రకంగా బయటపడగల్లేడో, తన ఇంటికి వచ్చిన మహిళా అతిథి మూలంగానే తాను
అవిటిది అయిన సంగతి ఆ వృద్ధురాలికి ఎలా తెలుస్తుందో, వెండితెర వెలుగుల జిలుగులతో కళ్ళు మూసుకుపోయిన ఆ యువకుడి జీవన చలన చిత్రానికి ఏ
మలుపు కాచుకొనివుందో, వృద్దుడికి ఉపకారం చేయబోయిన ఆ దైవారాధకుడికి తల ఎలా బొప్పి కట్టిందో విస్తృతానుభవాల జీవన ఘట్టాల పరంపర.
వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలు పెడితే చకచకా జారిపోయే సంభాషణలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ.
వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్.వి.వి. సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే!