ముందుగానే మనవి చేసుకుంటున్నాను. దేశభక్తుల్ని నొప్పించాలన్న ఉద్దేశం నాకు లేదు. అందరూ దేశభక్తులే! వాళ్ళు రెండు జాతులు. మట్టిని ప్రేమించే వాళ్లు కొందరు; మనుషుల్ని ప్రేమించేవాళ్లు మరికొందరు. మీరు రెండోరకం వాళ్లయితేనే ఈ కథ చదవండి. మొదటిరకం వాళ్ళయితే, నా మేలుకోసం మానెయ్యండి.
మహాప్రభో! నేను నిన్ను తిడితే, అది నేరమే! నిన్ను తిట్టను. ఏడుస్తాను. గుండె బాదుకుంటాను. ఇరవై ఏళ్ళ క్రిందట మా అమ్మ 'సంసారం' సినిమా చూసివచ్చి సరదాగా పడిందొక పాట. "ఏడువకు ఏడువకు నా చిట్టితండ్రీ, భావిభారత బాలవీరుడవు నీవు" అప్పుడు ఏడ్చాను. 20 ఏళ్ల తరువాత ఇప్పుడు ఏడుస్తాను. నా గుండె మూలుగును పెదవుల మీద పలికిస్తాను. అది నేరమని ఏ జడ్జీ కూడా చెప్పడు. పుట్టగానే పసిపాప ఏడుస్తుంది కదా? నువ్వు దానినోరు మూయించగలవా? ఏడ్చే స్వాతంత్ర్యం, మానవధముడి జన్మ హక్కయ్యా బాబూ! నేను ఏడుస్తాను. నీకు వేడుక చేస్తాను.
- డా. పి. సంజీవమ్మ