కొండా కోనల్ని దాటుకుని హైవే పక్కనున్న ఊరివైపు వచ్చింది బస్సు.
"రావారం రావారం" - కేక పెట్టేడు కండక్టరు. వీధి చివర రోడ్డు మీద ఆగిన బస్సులోంచి దిగింది శివంగి.
రాత్రి నుంచి సన్నగా జల్లు కురుస్తూనే ఉంది. విథంతా రొచ్చు రొచ్చుగా, బురద బురదగా ఉంది.
బట్టల సంచినీ, గోనె మూటనీ రెండు చేతుల్లో పట్టుకుని రోడ్డు స్లోపు దిగి నడుస్తోంది. ఆమె మనసు నిప్పుల్లో కాలుతున్నట్టుంది. దారి పక్క బురదలో పడుకున్న గేదెలు వొంటి మీద వాలుతున్న జోరీగల్ని తోకల్తో తోలుకుంటున్నాయి. టపటపా చెవుల్తో కొట్టుకుంటున్నాయి.
శివంగి చీరకుచ్చిళ్లు బురదలో తడిసి తపతమంటున్నాయి. ఇంటికి చేరుకునేసరికి వొళ్లంతా గేదెల రొచ్చుతో స్నానమాడినట్టయింది.
- పి. సత్యవతి