Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆకలి చదువులు
మా నాయనమ్మ పెద్దకర్మకు మా వూరు వెళ్ళాను.
మా వూరు అంత పెద్దదీకాదు; అంత చిన్నదీకాదు. మధ్యతరహాకు చెందినది. భారతదేశంలో మా వూరులాంటి ఊళ్ళు కొన్ని వేల సంఖ్యలో వుంటాయి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ఉద్దేశ్యంతో ప్రభుత్వం తలపెట్టిన "పంచాయితీరాజ్" పాలనక్రిందే మా వూరున్నది. ప్రథమ పంచవర్ష ప్రణాళికకు ముందు మా వూరు ఎవరైనా వెళ్ళివుండి, పదిహేనేళ్ళ తర్వాత - అనగా తృతీయ పంచవర్ష ప్రణాళికానంతరం మళ్ళీ ఓసారి దయచేస్తే, మా వూళ్ళో ప్రణాళికా కృషి ఎంత భారీ ఎత్తున జరిగిందో ఇట్టే బోధపడుతుంది. వీధులు మారాయి; వీధుల రంగులు మారాయి. పశువులు విశ్రాంతి తీసికోను మురికి గుంటలలో గుడిశెలు వెలిశాయి. గుడిశెలు వుండే స్థలాలలో బంగాళా పెంకు షెడ్డులు లేచాయి; పెంకుటిళ్ళు వుండే చోట్ల డాబాలు, మేడలు సగర్వంగా తలలెత్తాయి. గొంగళి పురుగు రూపాలు మార్చుకున్నట్టు పందొమ్మిదవందల యాభై ఒకటిలో గ్రామానికంతా ఆముదపు వృక్షంలాగావున్న ఎలిమెంటరీ స్కూలు మిడిల్ స్కూలుగా మారి, మరి మూడేళ్ళలో హైస్కూలై, ఆపైన అయిదేళ్ళలో హయ్యర్ సెకండరీ స్కూలుకోసం దరఖాస్తు పెట్టుకుంది. ఊరికి విద్యుద్దీపాలు వచ్చాయి. కిళ్ళీ కొట్టువాళ్ళు కూడా కరెంటు పెట్టించారు. పంచాయతీ బోర్డువారు వీధులలో దీపాల తోరణాలను అమర్చి,రాత్రికి, పగటికీ పెండ్లి చేసి, కాపురం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగేట్టు చూస్తున్నారు. ఇప్పుడు మా ఊరి ప్రజలకు అపరాలు, కూరగాయలు దక్షిణగా యిచ్చుకొని నంబి ఆచార్యుల చేత వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి లేదు. పది మానికల బియ్యం యిచ్చి మంత్రసాని | మంగమ్మ చేత పురుళ్ళు పోయించుకోవాల్సిన దుర్గతి లేదు. పంచాయతీ సమితి వారి పుణ్యాన, ఊళ్ళో షావుకార్ల రాజకీయ నాయకుల ధర్మాన - ఒక హెల్టు సెంటరు, మెటర్నిటీ హాస్పిటలు ఏర్పాటు చేయబడి, ఉచిత వైద్య సౌకర్యాలు వేసవికాలంలో మంచితీర్థం వలె లభిస్తున్నాయి. పంచాయితీ వారు రేడియో, తగినన్ని స్పీకర్లు ముఖ్యమైన వీథుల మలుపులలో అమర్చి సంగీత, సాహిత్య, వినోద కార్యక్రమాలతో పాటు దేశంలోను, విదేశాలలోను ఏం జరుగుతుందా వినిపిస్తున్నారు. ఇలాంటివి ప్రణాళికాబద్ధమైన మార్పులు ఎన్నో మా వూళ్ళో వచ్చాయి. దేశానికి గ్రామసౌభాగ్యం వెన్నెముకలాంటిదని వేరే చెప్పనక్కర్లేదు.............