నా పేరు గోదావరి. మా ఊరు సహ్యగిరి.
నా జన్మస్థానం సహ్య పర్వతపంక్తులలో త్ర్యంబకేశ్వరం. నేను ఆడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్ నగరం. దీనినే పూర్వం పంచవటి అనేవారు. నేను నాతోడి చెలిమి కత్తెలతో కలిసి మెలసి పెరిగి పెద్దదానినై క్రమక్రమంగా మిట్టపల్లాలు దాటి గుట్టలూ మెట్టలు గడచి, అడవులు అతిక్రమించి కొండలగుండా లోయలలో పడి, సుడులు తిరిగి, అవరోధాలన్నీ అధిగమించి కడలిరాయని గడపలో అడుగు పెట్టాను.
- జంధ్యాల పాపయ్య శాస్త్రి