హంపీ విజయ నగర సామ్రాజ్యం భారతీయ సంస్కృతికి, తెలుగు, కన్నడ, తమిళ భాషలకు సేవ చేసి, హిందూ ధర్మ ప్రతిష్టాపనలోనూ, పరిరక్షణ కోసం, కంకణం కట్టుకున్న మహా సామ్రాజ్యంగా భాసిల్లడం ఒక ఎత్తైతే, మొత్తం దక్షిణాదిలో గోవా, కొచ్చిన్, భత్కల్ ఓడరేవుల పైన ఆధిపత్యంతో త్రిసముద్రాధీశులుగా విజయనగర ప్రభువులు వాసికెక్కడం ఒక్కటీ ఇంకొక ఎత్తు.
'అంగళ్ళ రతనాలు పోసి అమ్మినారట ఇచట' అనేది నిత్య సత్యమైన అంశం ఇక్కడ.
నిరంతరం విదేశీ వర్తక ప్రముఖులతో కళకళలాడిన వాణిజ్య కేంద్రాలెన్నో హంపీ - విజయనగరంలో ఉండేవి. యూరప్ సహా అనేక దేశాల నుండి చరిత్రకారులు, రాయబారులు, విదేశీ యాత్రికులతో రద్దీగా ఉండేది హంపీ విజయ నగరం.
ఈ విదేశీ ప్రముఖులు వ్రాసి పెట్టిన కవిలెలు విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రధాన ఆకారాలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రతో సమకాలీన దేశాల చరిత్ర కూడా ముడి పడి - సాగటం ఒక విశేషం.
- టెకి వీరబ్రహ్మం