ఈ నవలను చదవటం ఏ పాఠకుడికైనా తన సామజిక జీవితానుభవాన్ని విస్తృతపరుస్తుందని నా నమ్మకం. ఈ నవలకు కేంద్రం ఒక చిన్నపల్లె అయినప్పటికీ, దాని పరిధి దేశమంత విస్తృతమైనట్టిది. కొన్ని నదుల నీళ్ళు ఒక జలాశయంలో ఇమిడినట్టుగా, ఎన్నో సాంఘిక , ఆర్ధిక రాజకీయ సవ్యాపసవ్య సందర్భాలు ఈ నవలలో ఎంతో చిక్కగా, కుదురుగా ఇమిడి వుండటం, రచయిత శిల్పప్రతిభకు పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. ఇందులోని ప్రతి వాక్యం వెనుకా, వెన్నాడుతున్నట్టుగా రచయిత గొంతుక ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. మన సామజిక జీవితం ఎంత భీభత్సంగా ఉందొ, మానవ సంబంధాలు గానుగలో పిప్పిలా ఎలా పిండీకృతం అవుతున్నాయో' ఎంతో భయానకంగా, రౌద్రంగా, వర్ణించి చూపెడుతుంది ఈ నవల. మౌఖిక సంప్రదాయాన్ని రచయిత పాటించడం ద్వారా పాఠకుడిని తల ప్రక్కకు తిప్పనివ్వకుండా నిమగ్నం చేయటం ఈ నవల రచనలో రచయిత సాధించిన అద్భుత శిల్ప ప్రయోజనం - పాత్రలూ, జీవితమూ, భాషా, యాసా, సన్నివేశ కల్పనా, విమర్శనాపూర్వక వాస్తవికత, రచయిత కంఠస్వరం, ప్రయోజన దృష్టి, యిలాంటివన్నీ ఒకే కూర్పులో కలిసిపోవటం ద్వారా, ఈ నవల సాధారణ పాఠకుడి నుండి నద్విమర్శకుని వరకూ హృదయగతమవుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను.