Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆధునిక భారతదేశ నిర్మాత, భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, మేధావి, మనదేశ రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఆయన పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్. ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు. 14 ఏప్రిల్ 1891లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలోని 'మౌ' అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ మిలటరీవుద్యోగి. ఆయన స్వస్థలం మహరాష్ట్రలో రత్నగిరి జిల్లాకు చెందిన అంబావాడే గ్రామం. సంసారం పెద్దదైనందున అంబేడ్కర్ కుటుంబం తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొంది. ఆయన ఆరేళ్ల వయసులో తల్లి భీమాబాయి (1854-1896) మరణించింది. వీరికి కలిగిన 14మంది సంతానంలో అంబేడ్కర్ ఆఖరి బిడ్డ.
చదువు
ప్రాథమిక విద్యపూర్తయిన తర్వాత అంబేడ్కర్ ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ హైస్కూల్లో చేరాడు. ఆరోజుల్లో అతని కుటుంబం అంతా ముంబైలోని ఒక మురికివాడలో ఒకే గదిలో జీవించాల్సివచ్చింది. అత్యంత దుర్భరమైన, ఘోరమైన పేదరికంలో కనీసం చిమ్నీకూడ లేని కిరోసిన్ దీపపు వెలుగుపొగల మధ్య చదువు కొనసాగింది. హిందూ సామాజిక కులాల్లో అట్టడుగు కులమైన 'మహర్' కులంలో జన్మించిన అంబేడ్కర్ అనేక అవమానాలు, వివక్షల మధ్య చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో మంచి మార్కులతో చదువును కొనసాగించాడు. ఈ పరిస్థితుల్లో 1907లో మెట్రిక్యులేషన్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అప్పటికి అంబేడ్కర్ వయసు 17 సంవత్సరాలు. అనాటి సమాజం ప్రకారం అదే సంవత్సరం అంబేడ్కర్‌కు సహనశీలి రమాబాయితో వివాహమయ్యింది.