కన్నాంబ తెలుగునాట పుట్టి, రంగస్థలం పై నుండి వెండితెర మీద కాలుమోపి మూడుతరాల ప్రేక్షకులను అలరించిన ప్రజ్ఞావంతురాలైన నటి. తెలుగు, తమిళ, హిందీలో కలిపి శతాధిక చిత్రాలలో నటించి, సుమారు ముపై చిత్రాలు నిర్మించిన కన్నాంబ తన తరంలో నాయికలుగా వెలుగొందిన తారలందరిలో కన్నా ప్రత్యేకస్థానాన్ని పొందారు. తొలి, మలి తరం తారలైన ఎన్టీరామారావు, అక్కినేని, ఎస్.వి.రంగారావు ఈలపాట రఘురామయ్య, ఎస్.వరలక్ష్మి అంజలి, జమున తదితరులు, కన్నాంబ కంపెనీ తీసిన చిత్రాల్లో నటించి నటనలో ఓ మెట్టు పైకొచ్చినవారే. నటిగా, నిర్మాతగా తెలుగు సినిమా తొలినాటి వికాసపరిణామాలకు కారకురాలిగా కన్నాంబ చరిత్ర కెక్కారనడం అతిశయం కాదు. అందుకే తెలుగు చలన చిత్ర చరిత్రలోని స్వర్ణయుగంలో వెలసిన ధ్రువతార కన్నాంబ.