తెలుగు రాష్ట్రాల పిల్లల జీవితాలను చెరబట్టిన ప్రముఖ విద్యాసంస్థల చరిత్రంతా ఇందులో ఉంది. నిజానికి ఇది చారిత్రక నవల. ఇందులో కల్పిత పాత్రాలేవి లేవు. కల్పిత సంఘటనలు కూడా లేవు. చరిత్రను కథగా, నవల రూపంలో నిక్షిప్తం చేశారు రచయిత. ఒక యాభై ఏళ్ళ తర్వాత ఏదైనా పెనుమార్పు వచ్చి కొత్త చరిత్ర రాయవలసి వచ్చినప్పుడు ఈ నవలకు ఎక్కడలేని ప్రాముఖ్యత వస్తుంది. ప్రతిపాత్రను వాస్తవ జీవితం నుంచి తీసుకుని, ఆ పాత్రల మనస్తత్వాలను అతి సహజంగా చూపించారు రచయిత సింహప్రసాద్. ఆయనకు సూటిగా రాయగల శక్తి ఉంది. రచనకు ప్రధానంగా కావలసిన చదివించే గుణం అయన రచనల్లో పుష్కలంగా ఉంది. సామజిక సంక్లిష్టతలను అర్ధం చేసుకోగల మేధావి. దానితో పాటు ఆ సంక్లిష్టతను అందరికి అర్ధమయ్యేలా, ప్రతీవారి జీవితాన్ని అద్దంలో చూపించినట్లుగా కథ నిర్మించి నడిపించి కనువిప్పు కలిగించగలిగిన కథను రీతి కూడా అయన చేతిలో ఉంది. అదే నవలకు పఠనీయతని చేకూర్చింది.