Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.
'క్రీస్తు చరిత్ర' (1963) జాషువా గారి కావ్యాలన్నిటిలోనూ తలమానికమైనది. ఆ కావ్యానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.
క్రీస్తు చరిత్రలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన సువార్తల ఆధారంగా క్రీస్తు చరిత్రని ఎంతో శ్రద్ధతో, భక్తితో, వినయంతో తిరిగి చెప్పారు.
రెండవది, ఈ కావ్యంలోని పద్యనిర్మాణంలో ఆయన ఎన్నోచోట్ల కవిత్రయాన్ని తలపించే ఎత్తులకు చేరుకోగలిగారు.
మూడవది, చాలా ముఖ్యమైనది. అదేమంటే, తొలినుంచీ జాషువాలో ఈ లోకం పట్ల గొప్ప ఆనందం, ఈ సమాజం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఒకదానితో ఒకటి పెనవేసుకునే వున్నాయి. కాని దయామయుడూ, పతితపావనుడూ అయిన యేసు కథ చెప్తున్నప్పుడు అంతదాకా తన అంతరంగంలో సంఘర్షిస్తూ వస్తున్న ఆ పరస్పర విరుద్ధ భావాల్ని ఆయన సమన్వయించుకోగలిగాడనీ, తనకై తాను ఒక సమాధానం పొందగలిగాడనీ అనిపిస్తుంది.