'ప్రజావళికి ఘనమైన బౌద్ధధార్మిక సాహిత్యాన్ని అందించడానికి తాను బౌద్ధమహాసాగరంలో మునిగి, లీనమై, అకుంఠిత దీక్షతో కృషి చేసి, రచన చేసి, ఆ మహాసాగరాన్నుంచి నటరాజ్ శాక్యగా పైకి తేలి, మిత్రులు శ్రీ నటరాజ్ శాక్య అందిస్తున్న గొప్ప రచన యీ గ్రంథం. ఆచార్య నాగార్జునుడ్ని అర్థం చేసుకోవడం అంటే మాటలకందే విషయం కాదు. అటువంటిది సామాన్యులకు కూడా నాగార్జునుడు అర్థం అయ్యేలా చేయడం అంటే, అది బుద్ధధర్మంలో ఎంతో పరిణితి, - అభినివేశం, జనులకి అర్థం చేయించాలన్న మహాకరుణ, పట్టుదలలు వుంటే తప్ప సాధ్యంకాదు. ఈ గ్రంథంతో శ్రీ నటరాజ్ శాక్య బౌద్ధ సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ గ్రంథం తెలుగునేలమీద బుద్ధధర్మాన్ని ప్రతీత్య సముద్పాదసహితంగా అందించిన గ్రంథంగా మాత్రమే కాకుండా, ఆచార్య నాగార్జునునిపట్ల వున్న అపోహలను తొలగించి, పాఠకులలో సరియైన కొత్త దృక్పథాన్ని ఏర్పరుస్తుంది అనడంలో సందేహంలేదు”
- డాక్టర్ బొర్రా గోవర్ధన్
సుహృన్మిత్రులు శ్రీ డి. నటరాజ్ శాక్య, బుద్ధ - అంబేడ్కరు సాహిత్య రచనలో తెలుగువారికి చిరపరిచితులు. వారు ఇప్పుడు అందిస్తున్న, 'నిత్య నిర్వాణ ఆనందపథం - బుద్ధనాగార్జునుల బోధనల సమాహారం' అన్న యీ ఉజ్వల గ్రంథం, బుద్ధధర్మానికి వారు అందించిన అపూర్వమైన సేవగా తలుస్తున్నాను. చదువరులకు ఎంతో ఉపయోగమైనట్టి యీ గ్రంథాన్ని మా 'లతారాజా ఫౌండేషన్' తరపున ముద్రించడం మాకు చాలా ఆనందంగా వుంది.
- శ్రీ కె.కె. రాజా, లతారాజా ఫౌండేషన్, హైదరాబాద్