మానవులందరూ సహజంగానే ఆనంద స్వభావులు. పసిపిల్లల్ని చూడండి ఎంత హాయిగా, ఎంత చక్కగా నవ్వుతారో? కష్టజీవులందరూ అంతే. శ్రామిక మహిళల్ని చూడండి, వారు పేదవారు. పుస్తులైనా బంగారపువి వుంటాయో లేదో? పనిలోకి వచ్చేటప్పుడు చక్కగా ముఖం కడుక్కుని, యింత పసుపు రాసుకుని, కాటుక, బొట్టు పెట్టుకుని, తలలో తప్పకుండా ఏ మందారపులో, చేమంతులో పెట్టుకుని పనిలోకి వస్తారు. సహజమైన అందం, సహజమైన చిరునవ్వు, ఎందుకని వారంత ఆనందంగా వుండగలుగుతున్నారు?
ఎదురుగా లభించిన ఆనందమే వారికి మిక్కిలి ఆనందం. ఎర్రని మందారాలు మోగ్గలిచ్చితే చాలు వారికెంతో ఆనందం. చక్కగా పాయతీసి తలలో పెట్టుకుంటారు. కుంకుమ, కాటుక పెద్ద ఖరీదే కానివి. మెడలో వేసుకునేవీ అంతే, పసుపుతాడు, నల్లపూసలు దండ. అయినా ఏ రాణీకి వుంటుంది అంత ఆనందం?
- డి. నటరాజ్