బొర్రా గోవర్ధన్ గారు మొదట సైన్స్ రచయిత . ఏది చదివిన శాస్త్రీయంగా అవగాహన చేసుకుంటాడు . హేతు బద్దంగా ఆలోచిస్తాడు. తాను తెలుసుకున్నది సులభశైలిలో రాసి అందరికి పంచుతుంటాడు. బౌద్ధాన్ని వంటబాట్టించుకోవటమే కాక ఇంటిల్లిపాది ఆచరణయోగం చేశాడు. బుద్ధుడు చెప్పినట్లు అవిద్యను పారద్రోలినపుడే వివేకం వెల్లివిరుస్తుందనీ నమ్మినవాడు. అంత మంచి గురించే ఉండే బౌద్ధ ధర్మాన్ని వీలైనప్పుడల్లా మిత్రులతో చర్చించటం, ప్రసంగించటం, పత్రికల ద్వారా విస్తృతం గా రాయటం గోవర్ధన్ గారు ఓ ఉద్యమంలా చేపట్టారు. బుద్ధభూమి, స్వేచ్ఛలోచన, ప్రజాసాహితి, అమ్మనుడి, రేపటికోసం, పల్లెపందిరి, ధ్యానమాలికలు, న్యూస్ ౩౦, జనపథం లాంటి పత్రికల్లో బౌద్ధం గురించి రాయటమే కాక, ధర్మదీపం ఫౌండేషన్ ద్వారా బౌద్ధం పైన హేతువాదం పైన ఎన్నో పుస్తకాలు రాశారు.