Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

         జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో 1931 జూలై 29న జన్మించారు. కవిగా, విమర్శకుడుగా, వక్తగా లబ ప్రతిష్ఠులైన నారాయణరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ గా పరిపాలనారంగంలో కూడా కీర్తి గడించారు. అసంఖ్యాకమైన ఆయన కృతుల్లో ఋతుచక్రం రాష్ట్ర సాహిత్య అకాడమి, మంటలూ మానవుడూ కేంద్ర సాహిత్య అకాడమి బహుమతులు పొందగా విశ్వంభర కావ్యం ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం అందుకొన్నది. పద్మభూషణ్, కళాప్రపూర్ణ మొదలగు గౌరవ బిరుదులు ఆయన్ను వరించాయి. ఆధునికాంధ్ర కవిత్వ సమాలోచనయైన సిద్ధాంత గ్రంథం సుమారు పది ముద్రణలు పొందింది. సినీగేయ రచనలో ప్రతిభను చాటి 'సినారె' ముద్రను భద్రపఱచుకొన్నారు. ఆయన కవనం సంప్రదాయ ప్రయోగ సమ్మేళనం. ఆయన విమర్శనం సమదర్శనానికి నిదర్శనం. కవిత్వం ఆయన చిరునామా.

             ప్రముఖ సాహిత్య విమర్శకులు ప్రొఫెసర్ ఎస్వీ రామారావు 1941 జూన్ 5వ తేదీన వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., పిహెచ్.డి పట్టాలు పొందిన ఆచార్య రామారావు ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్‌గా 2001లో పదవీ విరమణ చేశారు. 1956 నుంచీ రచనా వ్యాసంగం చేపట్టి 35 గ్రంథాలు, శతాధిక పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. తెలుగులో సాహిత్య విమర్శ సిద్ధాంత గ్రంథం ఆరు ముద్రణలు పొందింది. సమవీక్షణం, అభివీక్షణం, విశ్వనాథ దర్శనం, తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం ఉత్తమ విమర్శ బహుమతులు అందుకొన్నాయి. సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర రచించిన రామారావు గురజాడ, సురవరం, దాశరథి మొదలైన పెక్కు సాహితీ పురస్కారాలు పొందారు. పలు జాతీయ సదస్సులతోపాటు 5వ ఉత్తర అమెరికా తెలుగు కాన్ఫరెన్స్ (తానా) సభల్లో (1985) పాల్గొన్నారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పరిశోధకసంఘ సభ్యులైన ఎస్వీ రామారావు తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యుడుగా, కేంద్ర సాహిత్య అకాడమి తెలుగు సలహాసంఘ సభ్యుడుగా కొనసాగుతున్నారు.