ఆధునిక సమాజంలో ప్రేమ ఆంటే స్త్రీ పురుష ప్రేమకు, ముఖ్యంగా లైంగికపరమైన అర్ధంతో కూడుకున్న ప్రేమకు పర్యాయపదంగా ప్రచారాం చేయటం జరుగుతుంది. ఈ ప్రచారంలో వైవాహికేతర సంబంధాలను ఆదర్శంగా, అభివృద్ధిగా, విముక్తిగా ప్రచారం చేస్తూ ప్రేమ భావనకు మరింత లైంగికపు రంగు పూయటం కనిపిస్తోంది. ఇలాంటి ప్రచార ప్రభావానికి లోనైన అమాయక యువత ఆకర్షణకు , లైంగికోద్దీపనకు, ప్రేమ భావనకు నడుమ తేడా తెలుసుకోలేక తమ జీవితాలే కాదు, తమ పై ఆశలు పెట్టుకున్న పెద్దవారి జీవితాలను దుఃఖమయం చేస్తుంది. అపోహలు తొలగి నిజానిజాలు తెలిసేసరికి చేతులు కూలుతున్నాయి. జీవితం చేజారిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో సృజనాత్మక రచయితగా ప్రేమ గురించి ఒక ఆలోచనను, అవాహనను కల్పించేందుకు ప్రేమ విరాట్ స్వరూప ప్రదర్శన ద్వారా ప్రచార ప్రభావ తీవ్రతను కొంచమైనా తగ్గించాలన్న ఆశతో, విశ్వాసంతో రచయిత కస్తూరి మురళీకృష్ణ సృజించిన కథల సంపుటి ఈ ప్రేమ కథామాలిక.