Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అనగనగా..
ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథా సంకలనం 'పంచతంత్రం'. ప్రపంచంలో ఎక్కువ మందిని చేరిన పుస్తకాలలో బైబిల్ తొలి స్థానంలో ఉంటే, పంచతంత్రం తరవాతి స్థానంలో ఉందంటారు కొందరు. నాగరికత మొదలయినప్పటి నుండి నేటి వరకూ పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్న గ్రంధం 'పంచతంత్రం'. ఇవి కాలానికి నిలిచిన కథలు. గుణాఢ్యుడు పిశాచ భాషలో రచించిన గ్రంధం 'బృహత్కథ'. ఆ గ్రంధం నుండి విష్ణుశర్మ అనే పండితుడు కొన్ని కథలను ఎంచి 5వ శతాబ్దములో ఈ పంచతంత్రం రాశాడు.
అప్పటినుండి ఈ పుస్తకం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడింది. 'పంచతంత్రం' అనగా ఐదు తంత్రాలతో కూడిన గ్రంధం. ఇవి కాలక్షేపానికి చెప్పిన కథలు కావు. విష్ణుశర్మ అనే పండితుడు మందబుద్ధులైన రాజకుమారులకు లోకజ్ఞానం బోధించటానికి ఈ కథలు చెప్పినట్లు ప్రధాన కథ చెప్తున్నది.
ఇందులో ఎక్కువ కథలలో జంతువులే ప్రధాన పాత్రలుగా ఉన్నాయి. వాటి ద్వారా నీతిని, ప్రపంచంలో ఎలా జీవించాలి అనే విషయాల్ని చెప్పడం జరిగింది. 5వ శతాబ్దంలోని విష్ణుశర్మ పంచతంత్రం ఆధారంగా 14 వ శతాబ్దంలో నారాయణ కవి 'హితోపదేశం' అనే పుస్తకాన్ని రాశాడు. 19వ శతాబ్దంలో పరవస్తు చిన్నయసూరి “నీతి చంద్రిక' పేరుతో తెలుగులోకి అనువదించారు. మిత్రబేధము, మిత్రలాభము అన్న మొదటి రెండు భాగాలు నీతిచంద్రికలో ఉన్నాయి. కాకోలూకీయం, లబ్దప్రణాశం, అపరీక్షిత కారిత్వం మిగిలిన మూడు భాగాలు. మొదటి నాలుగు తంత్రములలో ముఖ్యంగా పశుపక్ష్యాదులు, మృగాలు కథానాయకులు. ఐదవ తంత్రములో మనుషులే ప్రధాన పాత్రలు.
ఈ పంచతంత్ర గ్రంధాన్ని ఎందరో మహానుభావులు వారివారి శైలిలో తెలుగు బాలబాలికలకు, పెద్దలకు చెప్పారు. సరళమైన వచనంలో ఈనాటి చిన్నారులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి ఈ బృహత్కథలను మరొకసారి చెప్పాలనే నా ఈ ప్రయత్నాన్ని ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.